- నేరుగా లాంచ్ మౌంట్లోకి వచ్చి చేరిన స్టార్ షిప్ బూస్టర్
- ప్రపంచంలోనే తొలిసారి ఈ ఫీట్ సాధించిన స్పేస్ ఎక్స్
బ్రౌన్స్ విల్లే (టెక్సస్): అది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ రాకెట్. పైకి ఎగరడమే కాదు.. కిందకు సేఫ్ గా దిగడంలోనూ ఇదివరకే సత్తా చాటింది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా నేరుగా లాంచ్ మౌంట్ కు ఉన్న మెటల్ చాప్ స్టిక్ ఆర్మ్స్ మధ్యకు వచ్చి వాలిపోయి ఔరా! అనిపించింది. ఆ రాకెట్ బూస్టర్ పేరు ‘సూర్ హెవీ (స్టార్ షిప్ బూస్టర్)’ కాగా, ఈ ఘనత సాధించిన కంపెనీ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్. చరిత్రాత్మకమైన ఈ ప్రయోగం ఆదివారం ఉదయం 8.25 గంటలకు సౌత్ టెక్సస్ లోని స్టార్ బేస్ సైట్ వద్ద విజయవంతంగా ముగిసింది.
అంగారకుడు, మార్స్ వంటి గ్రహాలకు మనుషులను తీసుకెళ్లేందుకు స్పేస్ఎక్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టార్ షిప్ వ్యోమనౌకను తయారు చేసింది. దీనిని ప్రయోగించేందుకు సూపర్ హెవీ రీయూజబుల్ రాకెట్ ను సిద్ధం చేసింది. వీటికి ఆదివారం ఐదోసారి ఫ్లైట్ టెస్ట్ చేసి విజయం సాధించింది. ఇప్పటివరకు లాంచ్ ప్యాడ్ కు దూరంగా కాంక్రీట్ వేదికపై లేదంటే సముద్రంలో ఏర్పాటు చేసిన వేదికలపై రీయూజబుల్ రాకెట్ దిగింది.
కానీ తాజాగా జరిగిన ప్రయోగంలో.. లాంచ్ ప్యాడ్ పైనే, అది కూడా మెటల్ ఆర్మ్స్ మధ్యకు పూర్తి పర్ఫెక్ట్ గా వచ్చి రాకెట్ బూస్టర్ చేరడంతో స్పేస్ఎక్స్ కంట్రోల్ రూంలో సైంటిస్టులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా 50 మీటర్ల పొడవైన స్టార్ షిప్ ను మోసుకుని 122 మీటర్ల పొడవైన సూపర్ హెవీ రాకెట్ విజయవంతంగా నింగికి ఎగిసింది. 70 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత స్టార్ షిప్ నుంచి వేరుపడిన రాకెట్.. తిరిగి కిందకు దిగివచ్చింది.
ప్రయోగం మొదలైన 65 నిమిషాల తర్వాత స్టార్ షిప్ తిరిగి తన ఆరు ఇంజన్లను మండించి, హిందూ మహాసముద్రంపై విహరించింది. తర్వాత ప్లాన్ చేసిన ప్రకారం పేలిపోయి సముద్రంలో కూలింది. కాగా, ఇతర గ్రహాలకు మనుషులను పంపే దిశగా ఈ ప్రయోగంతో గొప్ప ముందడుగు పడిందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.