మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. అనేక వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. తాజాగా ఆయన ఓ సెటైర్ వేశారు. తన ఎక్స్ అకౌంట్‌లో ఈ అంశంపై స్పందిస్తూ ఓ మీమ్‌కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్ అని కూడా మరో ట్వీట్ చేశారు. చూడాలి మరీ మైక్రోసాఫ్ట్ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ పై ఎలా స్పందిస్తుందో.
కాగా మరోవైపు ఎలన్ మస్క్ జోస్యం నిజమైందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ గురించి ఎలన్ మస్క్ మూడేళ్ల క్రితమే చెప్పాడని.. ఏదో ఒకరోజు మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగి అది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నష్టానికి దారి తీస్తుందని గతంలో ఎలన్ మస్క్ మైక్రోసాఫ్ట్ పై చేసిన సెటైరికల్ ట్వీట్ లను నెటిజన్స్ రిట్వీట్ చేస్తున్నారు.
ALSO READ | మైక్రోసాఫ్ట్ సర్వర్లు డౌన్.. ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులకు బ్రేక్
ఇంకోవైపు క్లౌడ్ సర్వీసుల్లో సమస్యల వల్ల స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్ సంస్థలకు చెందిన విమానాల బుకింగ్, చెక్ ఇన్, అప్‌డేట్స్ అన్నీ గల్లంతయ్యాయి. అమెరికాకు చెందిన ఫ్రంటైర్ ఎయిర్‌లైన్స్ 147 విమానాలను రద్దు చేసింది. 200 విమానాలను ఆలస్యం చేసింది. సన్ కంట్రీ, ఎలిగంట్ సంస్థలు కూడా 50 శాతం వరకు విమానాలను రద్దు చేశాయి.