ఎలాన్ మస్క్ పక్షవాతం చిప్ బాగా పనిచేస్తోంది..మూడో పేషెంట్​కూ న్యూరాలింక్ చిప్

  • మూడో పేషెంట్​కూ న్యూరాలింక్ చిప్
  • ముగ్గురిలోనూ అవి బాగా పని చేస్తున్నయ్: ఎలాన్ మస్క్ 

లాస్ వెగాస్: పక్షవాతం, శరీర కదలికలను ప్రభావితం చేసే నాడీ సంబంధమైన ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం తాము రూపొందించిన న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ డివైస్​(చిప్)ను మూడో పేషెంట్ మెదడులో కూడా అమర్చామని న్యూరాలింక్ కంపెనీ ఓనర్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. 

లాస్ వెగాస్​లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ముగ్గురు పేషెంట్ల మెదడులోకి న్యూరాలింక్ చిప్​లను అమర్చామని, ముగ్గురిలోనూ అవి బాగా పని చేస్తున్నాయని తెలిపారు. 

ఈ ఏడాది 20 నుంచి 30 మందికి ఈ చిప్​లను ఇంప్లాంట్ చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, పక్షవాతం, శరీర కదలికలను ప్రభావితం చేసే నాడీ సంబంధ వ్యాధి ఏఎల్ఎస్ కారణంగా శరీరం చచ్చుబడిపోయిన పేషెంట్లలో వారి శరీర కదలికలను పునరుద్ధరించే లక్ష్యంతో న్యూరాలింక్ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది. 

ఇందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఎలక్ట్రోడ్లతో కూడిన చిప్​లను పేషెంట్ల మెదడు కణజాలంలోకి ప్రవేశపెడుతున్నారు. నిరుడు జనవరిలో నోలాండ్ అర్బాగ్ అనే పేషెంట్​కు న్యూరాలింక్ చిప్​ను అమర్చారు. ఆ తర్వాత మరో వ్యక్తికి, ఇటీవల ఇంకో పేషెంట్​కు ఇంప్లాంట్ చేశారు. 

ప్రస్తుతం వీరు ముగ్గురూ తమ ఆలోచనలతోనే రోబోటిక్ ఆర్మ్స్ వంటి వాటితో చిన్న చిన్న పనులు చేయగలుగుతున్నారు. కాగా, మెదడులో ఆలోచనలను బట్టి నాడీ కణాల నుంచి ఉత్పత్తి అయ్యే సిగ్నల్స్​ను న్యూరాలింక్ చిప్​లు గుర్తించి, డీకోడ్ చేస్తాయి. తర్వాత ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా తిరిగి మెదడుకు సిగ్నల్స్ పంపుతాయి. 

దీంతో ఆ వ్యక్తి చేతులు, కాళ్ల వంటివాటిని లేదా రోబోటిక్ చేతులు లేదా డివైస్​లను ఆలోచనలతోనే నియంత్రించేందుకు సాధ్యం అవుతుంది.