ఇట్లయితే ఇండియాలో వ్యాపారం చేసుకోలేం..మోదీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్!

ఇట్లయితే ఇండియాలో వ్యాపారం చేసుకోలేం..మోదీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్!

X(గతంలో ట్విట్టర్) ప్లాట్ ఫాం అధినేత ఎలాన్ మస్క్ మోదీ ప్రభుత్వంపై కోర్టుకెక్కాడు.తన కస్టమర్ల కంటెంట్ ను ఏకపక్షంగా తొలగిస్తూ ఐటీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుందని X ఆరోపించింది. ఐటీ చట్టం ప్రభుత్వానికి కంటెంట్ ను నిరోధించే అధికారం ఇవ్వదని వాదిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (ఐటీ చట్టం)లోని సెక్షన్ 79(3)(b)ని ఉపయోగించే విధానాన్ని సవాలు చేస్తూ కేంద్రప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వ అధికారులు సరైన చట్టపరమైన విధానాలను అమలు చేయడం లేదని, ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని X తన కంప్లయింట్ లో స్పష్టం చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ చట్టం ఆధారంగా ప్రభుత్వ అధికారులు చెప్పినప్పుడు కంటెంట్‌ను తీసేయాలి లేదా బ్లాక్ చేయాలా అనేది ఆయా కంటెంట్ ఆధారంగా ఆయా కంపెనీలు నిర్ణయిస్తాయని స్పష్టం చేస్తోంది ఎక్స్.  దీనిని సేఫ్ హార్బర్ అని పిలుస్తారు. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(b) ప్రభుత్వానికి కంటెంట్ ను బ్లాక్ చేసే అధికారాలు ఇవ్వదని X ప్లాట్ ఫాం వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై 2015 లో శ్రేయ సింఘాల్ తీర్పులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటి ప్రకారం.. సెక్షన్ 69Aని భారత ప్రభుత్వమే పక్కదారి పట్టిస్తుందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | గ్రోక్ ఏఐ బూతుల దండకంపై కేంద్రం సీరియస్.. ఎక్స్ పై చర్యలు తప్పవా..

సెక్షన్ 69A జాతీయ భద్రతను కాపాడటం వంటి నిర్దిష్ట కారణాల వల్ల మాత్రమే కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి అనుమతిస్తుందని.. సమీక్ష ప్రక్రియ అవసరమని X వాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి విరుద్ధంగా సెక్షన్ 79(3)(b)కి స్పష్టమైన నియమాలు లేవు. సరైన తనిఖీలు లేకుండానే అధికారులు కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి అనుమతిస్తున్నారు. ఇది భారత్ లో తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని కంపెనీ హెచ్చరించినట్లు తెలిసింది.కస్టమర్ల చట్టబద్దమైన సమాచారం పంచుకోగల సామర్థ్యంపై ఆధారపడి వ్యాపారం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇలాంటి బ్లాకింగ్ ఆర్డర్లు  ప్లాట్‌ఫామ్ కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని భయపడుతోంది.

సెక్షన్ 79(3)(b) అమలుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఆధ్వర్యంలో  సహయోగ్‌ పోర్టల్ ను రూపొందించారు. సహయోగ్ లో చేరాలని ప్రభుత్వం X ను కోరింది.. దీనికి కూడా X వ్యతిరేకిస్తోంది. సహయోగ్ ను సెన్సార్ షిప్ పోర్టల్ గా అభివర్ణిస్తోంది. ఈ వ్యవస్థను రూపొందించడానికి చట్టపరమైన ఆధారం లేదు.ఇప్పటికే 2021 ఐటీ రూల్స్ నిబంధనలు పాటిస్తున్నామని X కోర్టుకు విన్నవించినట్టు తెలుస్తోంది.