స్టార్​లింక్​ సేవలు ఆపేస్తే ఉక్రెయిన్​ సైన్యం కూల్తది

స్టార్​లింక్​ సేవలు ఆపేస్తే ఉక్రెయిన్​ సైన్యం కూల్తది
  • యూఎస్ ప్రెసిడెంట్ అడ్వైజర్ ఎలాన్ మస్క్ హెచ్చరిక  
  • నాటో నుంచి అమెరికా వైదొలగాలనీ కామెంట్ 

వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న నరమేధం తనను తీవ్రంగా బాధిస్తోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్​స్కీ దుష్టుడని, యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా ప్రవర్తిస్తున్నారంటూ మస్క్ ఇటీవల విమర్శలు గుప్పించారు. తాజాగా ఉక్రెయిన్​కు తన స్టార్​లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తే యుద్ధరంగంలో ఉక్రెయిన్ సేనలు కుప్పకూలిపోతాయని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘చేతనైతే నేరుగా వచ్చి నాతో తలపడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్​ను నేను గతంలో చాలెంజ్ చేశాను. ఉక్రెయిన్​కు నేను అందిస్తున్న స్టార్​లింక్ సేవలు అత్యంత కీలకంగా ఉపయోగపడుతున్నాయి. ఒకవేళ నేను వారికి స్టార్ లింక్ సేవలను టర్న్ ఆఫ్ చేస్తే గనక.. ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ కొలాప్స్ అవుతుంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ నరమేధాన్ని ఆపాలని ఎవరైనా అనుకుంటే గనక.. వారు యుద్ధం ఆపి, శాంతి స్థాపనకు ముందుకు వస్తారు” అని ఆయన పేర్కొన్నారు. అలాగే వాషింగ్టన్​లోని వైట్​హౌస్​కు సమీపంలో అతి భారీ సైజులో ఉన్న ఉక్రెయిన్ జెండాను ఎగురవేయడం, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టడంపైనా మస్క్ స్పందించారు. ఉక్రెయిన్​కు చెందిన సంపన్నులు (ఒలిగార్క్​లు), ప్రధానంగా మొనాకోలో విలాసవంతమైన భవనాలు ఉన్న వారే ఈ నిరసనలకు ఫండింగ్ చేస్తున్నారని అన్నారు. అందుకే ఉక్రెయిన్​కు చెందిన టాప్ టెన్ ఒలిగార్క్​లపై అమెరికా ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు.  

నాటో నుంచి ఎగ్జిట్ అవ్వాలి.. 

అమెరికా నాటో నుంచి కూడా ఎగ్జిట్ కావాలని మస్క్ అభిప్రాయపడ్డారు. యూరప్ రక్షణ కోసం అమెరికా నిధులు ఖర్చు చేయడం అర్థంలేనిదన్నారు. ట్రంప్ సీనియర్ అడ్వైజర్ మైక్ లీ ఇటీవల చేసిన ట్వీట్​కు ఈమేరకు మస్క్ మద్దతు పలికారు. ఐక్యరాజ్య సమితితోపాటు నాటో నుంచీ అమెరికా బయటకు రావాలన్నారు. కాగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)లో 32 దేశాలు ఉన్నాయి. ఆ కూటమికి వచ్చే నెలలోనే 76వ వార్షికోత్సవం జరగనున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలతో దాని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్  సైతం ఇదివరకే నాటో దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. కూటమిలోని దేశాలన్నీ తమ జీడీపీలో కొంత శాతం కూటమి కోసం ఖర్చు చేయాలని, లేకపోతే తాము ఎవరి రక్షణకూ సహాయం చేయబోమని తేల్చిచెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ పై, నాటోపై ట్రంప్ వైఖరి నేపథ్యంలో ఇటీవల యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. అన్ని దేశాలు రక్షణ బడ్జెట్​ను గణనీయంగా 
పెంచుకోవాలని తీర్మానించుకున్నాయి.