ఏపీలో మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్..కలెక్టర్ ఏమన్నారంటే.?

ఏపీలో మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్..కలెక్టర్ ఏమన్నారంటే.?

ఆంధ్రప్రదేశ్  ఏలూరు జిల్లాలో   ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్  అంటూ వచ్చిన వార్తలపై  జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పందించారు.  బాదంపూడి పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ గా ల్యాబ్ లో  నిర్దారణ అయినట్లు తెలిపారు  కలెక్టర్.  వ్యక్తికి బర్డ్  ఫ్లూ అంటూ వచ్చిన వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన అధికారిక ప్రకటన లేకుండా బర్డ్ ఫ్లూ గా నిర్దారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు కలెక్టర్.  ఖచ్చితమైన సమాచారం కోసం జిల్లా కలెక్టర్ ను సంప్రదించాలని సూచించారు. 

ఇప్పటి వరకూ ఇండియాలో  బర్డ్ ఫ్లూ మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని తేల్చారు జిల్లా కలెక్టర్.  ఇలాంటి సమయాల్లో మీడియా బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు కలెక్టర్.  బర్డ్ ఫ్లూ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని.. బర్డ్ ఫ్లూ నియంత్రణలో అందరూ సహకరించాలని కోరారు  కలెక్టర్ వెట్రి సెల్వి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో కోళ్ల ఫామ్ కు దగ్గరలో ఉంటున్న  ఓ వక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని ఫిబ్రవరి 13న ఉదయం ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని లేటెస్ట్ గా కలెక్టర్ ఖండించారు.  

మరోవైపు ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్పెక్టెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24X7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.

ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా రోజుల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా కోళ్లు చనిపోయాయి.  ఇప్పటికే చికెన్,గుడ్లు తొనద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది.  చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో  పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.