- గత జూన్‌లోనే పనులు పూర్తి చేయాలని ప్లాన్
- మంత్రుల ఆదేశాలతో పనుల్లో వేగం పెంచినా కంప్లీట్ కాలే..
- వరదలతో పూర్తిగా ఆగిపోయిన పనులు
- వానలు తగ్గినా ఇంకా స్టార్ట్ కానీ వర్క్స్
- కాంట్రాక్టర్‌కు ఇరిగేషన్ ఇంజినీర్ల నోటీసులు
- పెరిగిన అంచనా వ్యయం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి వరదల నుంచి కాపాడేందుకు నిర్మిస్తున్న కరకట్ట పనులు ఆగిపోయాయి. వరదల సమయంలో పనులు ఆపేశారు. కరకట్ట పనులు జూన్ నాటికే పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. వేగంగా పనులు సాగినా వరదల కారణంగా నిలిచిపోయాయి. వర్షాకాలం ముగిసినా నేటికీ పనులు మాత్రం తిరిగి ప్రారంభం కాలేదు.
ఇదీ పరిస్థితి...
కరకట్ట పనులు 2007లోనే సగంలో అర్ధంతరంగా ఆగిపోయాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ఏడాదే కొత్త సర్కారు భద్రాచలం టౌన్‌ను వరదల నుంచి రక్షించేందుకు రూ.38.45కోట్లను మంజూరు చేసి పనులు ప్రారంభించింది. భద్రాచలం శివారున కూనవరం రోడ్డులో అసంపూర్తిగా ఉన్న 700 మీటర్ల కరకట్ట పనులు పూర్తయితే పుణ్యక్షేత్రంలోకి చుక్కనీరు కూడా రాదు. ఈ క్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ శాఖ వెంటపడి పనులను పరిగెత్తించారు.
దీంతో కాంట్రాక్టరు శరవేగంగా పనులు చేశారు. ఆంధ్రా నుంచి ఎర్రమట్టిని, స్థానికంగా నల్లమట్టిని తెప్పించి వర్షాలు కురువ ముందే కట్ట ఎత్తు లేపారు. వరదల సమయంలో ఈ కట్ట చాలా ఉపయోగపడింది. కానీ వర్షాకాలం వచ్చాక పనులు ఆపేసిన కాంట్రాక్టరు తర్వాత మళ్లీ మొదలుపెట్టలేదు. బిల్లులు రాలేదనే కారణంతో పనులు ఆపేసినట్లుగా చెబుతున్నారు. పనులు ప్రారంభించాలని ఇరిగేషన్ ఎస్ఈ పదేపదే కోరినా కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం దశల వారీగా కరకట్ట పనులు పూర్తి చేయాల్సి ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెరిగిన ఎస్టిమేషన్..
గోదావరి కరకట్ట పనుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38.45కోట్లు కేటాయించింది. 700 మీటర్ల కరకట్టతో పాటు స్లూయిజ్ నిర్మాణం కూడా ఇందులోనే ఉంది. అయితే అనూహ్యంగా కరకట్ట విజయవాడ-జగదళ్ పూర్ నేషనల్ హైవేను దాటాల్సి రావడంతో ఎన్‌హెచ్ ఇంజినీర్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. నేషనల్ హైవేస్ అథారిటీ సూచనల మేరకు అక్కడ రిటైనింగ్ వాల్ ఇరువైపులా నిర్మించి తర్వాత కరకట్టను నిర్మించాల్సి వస్తోంది. ఇరువైపులా 500 మీటర్ల పొడవునా సిమెంట్‌తో రిటైనింగ్ వాల్ కట్టడానికి డిజైన్‌ను ఆమోదించారు. నేషనల్ హైవేస్ అథారిటీ పర్యవేక్షణలో ఇరిగేషన్ శాఖనే ఈ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మరో రూ.40కోట్ల వరకు అదనపు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. దీంతో కరకట్ట నిర్మాణానికి నిధుల ఎస్టిమేషన్ పెరిగింది.
కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం..
కరకట్ట పనులు ఆపిన కారణంగా కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. త్వరలోనే పనులు మళ్లీ మొదలవుతాయి. నేషనల్ హైవేను కరకట్టను దాటించే క్రమంలో ఇరువైపులా నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్, ఇతర పనులు కూడా మేమే చేపట్టాలి. వాటి డిజైన్లు వచ్చాయి. దీంతో ఎస్టిమేషన్స్ కూడా పెరిగాయి.
రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్