అమెరికాను మార్చేస్త.. నా నినాదం అమెరికా ఫస్ట్: ట్రంప్

అమెరికాను మార్చేస్త..  నా నినాదం అమెరికా ఫస్ట్: ట్రంప్
  •     ప్రపంచ శాంతి కోసం కృషి చేస్త
  •     ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతం
  •     పౌరులకు అత్యుత్తమ సేవలు అందిస్తం
  •     దేవుడి దయతో కాల్పుల నుంచి బయటపడ్డ
  •     రాజకీయ కక్ష సాధింపులుండవని ప్రకటన
  •     అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం

వాషింగ్టన్ : అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదం అని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 2025 అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరమని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.

 అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (అమెరికా టైమ్) ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్‌‌‌‌లోని క్యాపిటల్‌‌‌‌ హిల్‌‌‌‌ రోటుండాలో డొనాల్డ్ ట్రంప్​తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ జాన్‌‌‌‌ రాబర్ట్స్‌‌‌‌ ప్రమాణం చేయించారు. చేతిలో రెండు బైబిళ్లను పట్టుకుని మెలానియా పక్కన నిలబడగా.. వాటిపై ప్రమాణం చేసి ట్రంప్​ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్​గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్‌‌‌‌ దిగ్గజాలు హాజరయ్యారు. అనంతరం అధ్యక్షుడిగా ట్రంప్ ఫస్ట్ స్పీచ్ ఇస్తూ.. ‘ప్రపంచంలోనే అమెరికాను నంబర్ వన్​గా నిలబెడ్త. అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వాళ్లనందర్నీ బయటికి పంపిస్త. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు కృషి చేస్త. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్త. దేవుడి దయవల్లే ఆ రోజు కాల్పులు జరిగినా ప్రాణాలతో బయటపడ్డ’ అని ట్రంప్ పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థను పటిష్టం చేస్తాం

న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. ప్రపంచ దేశాలు అమెరికాను ఎంతో గౌరవిస్తున్నాయి. అలాంటి దేశంలో నేరాలు తగ్గించాల్సిన అవసరం ఉంది. అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కావాలి. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తాం. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా, న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా మారుస్తాం. నా పాలనలో రాజకీయ కక్ష సాధింపులకు చోటులేదు. అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్న. అమెరికాలోకి నేరస్థులు రాకుండా కఠిన చర్యలు చేపడతాం. రెస్టారెంట్లలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోకుండా చూస్తాం’’అని ట్రంప్ హామీ ఇచ్చారు.

సేవ చేయాలనే నన్ను ప్రజలు గెలిపించారు

చిన్న సమస్యలను కూడా పరిష్కరించే స్థితిలో అమెరికా ప్రభుత్వం ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘అమెరికాకు సేవ చేయాలనే నన్ను ప్రజలంతా కలిసి గెలిపించారు. ప్రపంచంలో అతి పెద్ద చమురు ఎగుమతిదారుగా మనమే ఉన్నాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం. హమాస్ చెర నుంచి బంధీలు విడుదల కావడం సంతోషకరం’’అని ట్రంప్‌‌‌‌ తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్ క్లింటన్, జార్జి బుష్‌‌‌‌ దంపతులు హాజరయ్యారు. ఇండియా తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ అటెండ్ అయ్యారు. అదేవిధంగా, పారిశ్రామిక దిగ్గజాలు ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్, ముకేశ్ అంబానీ, సుందర్ పిచాయ్ కూడా హాజరయ్యారు.

దేశాన్ని నంబర్​వన్ చేస్త

ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ దేశంగా అమెరికాను నిలబెడ్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆటో మొబైల్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ‘‘ప్రపంచమంతటికీ అమెరికా ఎనర్జీ ఎగుమతి కావాలి. ఎలక్ట్రిక్‌‌‌‌ వాహనాల తయారీలో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటాం. నచ్చిన వెహికల్ కొనుక్కునే స్వేచ్ఛ ఇస్తాం. అయితే, దేశం పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలి. ప్రతిభావంతులను ఎలాంటి వివక్ష చూపకుండా ప్రోత్సహిస్తం. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాం. ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం’’అని ట్రంప్ ప్రకటించారు. 

అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వాళ్లనందర్నీ బయటికి పంపిస్త. ప్రపంచంలోనే అమెరికాను నంబర్ వన్​గా నిలబెడ్త. ఆ రోజు కాల్పులు జరిగినా దేవుడి దయవల్లే ప్రాణాలతో బయటపడ్డ. అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. దేశంలో నేరాలు తగ్గించాల్సిన అవసరం ఉంది. అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కావాలి. విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తం. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా, న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా మారుస్తం. ప్రపంచమం తటికీ అమెరికా ఎనర్జీ ఎగుమతి కావాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం. రాజకీయ కక్ష సాధింపులుండవు. అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్న. అమెరికాలోకి నేరస్థులు రాకుండా కఠిన చర్యలు చేపడతాం.