ఎమర్జెన్సీ.. దేశ చరిత్రలో చీకటి రోజు

ఎమర్జెన్సీ.. ఈ మాట చెప్పగానే భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులు గుర్తొస్తాయి. మన దేశంలో ఎమర్జెన్సీకి నేటితో 46 ఏండ్లు నిండాయి. అత్యవసర పరిస్థితి విధింపు, ప్రజాస్వామ్య విలువలపై కర్కశ దాడి జరిగిన రోజు అది. భారతీయులే కాదు చట్టబద్ధ పాలన, ప్రజా పరిపాలన, రాజ్యాంగ బద్ధతలకు విలువ ఇచ్చే ప్రతి ఒక్కరు దానిని బ్లాక్​డేగా పరిగణించాలి. ఎమర్జెన్సీ సమయంలో మన జాతిపై అనేక దుశ్చర్యలు చోటుచేసుకున్నాయి. మన రాజ్యాంగం, మన వ్యవస్థలపై అది కొట్టిన చావుదెబ్బ ప్రభావంతో ఆ పరిస్థితి ఎన్నడూ పునరావృతం కాకూడదన్న భావన వేళ్లూనుకుంది. ఇతర ప్రాథమిక హక్కుల మాట అలా ఉంచి, ‘జీవించే హక్కు’ను కూడా ప్రజల నుంచి లాగేసుకున్న దుస్థితి అది. ఏమైతేనేం, ఈ వాస్తవాల్లో అనేకం సుస్పష్టమైనా ఎమర్జెన్సీకి దారితీసిన నిరంకుశ ధోరణి కాంగ్రెస్‌‌ పార్టీ హైకమాండ్​లో ఇంకా బలం పుంజుకుంటూ ఉండటమే ప్రస్తుత సమస్య.

భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌‌లాల్‌‌నెహ్రూ కేరళ, పంజాబ్‌‌ ప్రభుత్వాలను రద్దు చేసినప్పుడు ఎమర్జెన్సీ ధోరణిని మన దేశం ప్రత్యక్షంగా చూసింది. అలాగే 1960ల్లో ఇండో–-చైనా వార్​పై చర్చ సందర్భంగా నాయకత్వం గురించి ప్రశ్న తలెత్తినప్పుడు.. చైనా విషయంలో సర్వసన్నద్ధత గురించి ప్రశ్నించడం జాతి ఆత్మస్థైర్యాన్ని ప్రశ్నించడమేనని సాక్షాత్తూ ప్రధానమంత్రే అన్నారు. ఇక 1959లో ఇందిరాగాంధీకి కాంగ్రెస్‌‌ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ద్వారా ఇతరులకన్నా కుటుంబానికే ప్రాధాన్యమనే అంశానికి నెహ్రూ నాంది పలికారు. అందుకు తగినట్లుగా నెహ్రూ-గాంధీ వారసుల అడుగులకు మడుగులొత్తడానికి ఇష్టపడని అనేకమంది జాతీయ, ప్రాంతీయ స్థాయి నాయకులు ఎన్నో అవమానాలను ఎదుర్కొనక తప్పలేదు. ఆ విధంగా సదరు పార్టీ ఒకే ఒక్క కుటుంబానికి ఆస్తిగా మారిపోయింది. ఆ మేరకు దిగ్గజాలైన మొరార్జీ దేశాయ్‌‌, కె.కామరాజ్, అతుల్య ఘోష్‌‌, చరణ్‌‌సింగ్‌‌, దేవీలాల్‌‌, బాబూ జగ్జీవన్‌‌రామ్‌‌ వంటి నేతలైనప్పటికీ పార్టీపై కుటుంబ పెత్తనానికి వీలుగా పక్కకు నెట్టివేయబడ్డారు. ఆ విధంగా దేశంమీద ఏకపార్టీ పాలన రుద్దడానికి ప్రయత్నాలు సాగాయి.
తమకు పోటీ వస్తారనుకుంటే అంతే..
సోనియాగాంధీకి మార్గం సుగమం చేయడం కోసం సీతారాం కేసరి ఎంత కర్కశంగా తప్పించబడ్డారో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అదే తరహాలో కాంగ్రెస్‌‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి పూర్తి హక్కున్న జితేంద్ర ప్రసాద బరిలో నిలిచినందుకు ఆ తర్వాత ఆయనపై ఎలా కక్ష సాధించిందీ కూడా తెలిసిందే. ఇదే తీరులో ఇప్పుడు కూడా రాహుల్‌‌ గాంధీకి పోటీ కాగలరని అనుమానించిన ప్రతి యువ నాయకుడినీ వెంటాడుతున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబంలో అధికార కేంద్రీకరణ దాహం చూసి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు ఏవగించుకుంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్నప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విపరీత స్థాయిలో 80కిపైగా దఫాలు రాష్ట్రపతి పాలన విధించారు. తద్వారా రాజ్‌‌భవన్‌‌లు కాంగ్రెస్‌‌ పార్టీ డీఫాక్టో హెడ్​ క్వార్టర్స్​గా మారిపోయాయని సహజంగానే స్పష్టమైంది. ఇటీవల యూపీఏ హయాంలో కూడా ఇదే తరహా వైఖరి కొనసాగింది. 
డీఫాక్టో పాలనే కాంగ్రెస్​ విధానం
చివరకు కేంద్రంలో “సింహాసనం వెనుక అధికారం” అనే విధానాన్ని కాంగ్రెస్‌‌ పార్టీ ఎల్లప్పుడూ అనుసరిస్తూ వచ్చింది. తదనుగుణంగా తాము ‘వెలుపలి నుంచి మద్దతు’ ఇచ్చిన సంకీర్ణ ప్రభుత్వాల్లో ఏ ఒక్కదానికీ పూర్తికాలం పరిపాలించే అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్‌‌ అధికార దాహం ఫలితంగా కొనసాగిన అరాచకాలు విస్తృతమై చివరకు న్యాయవ్యవస్థనూ వదిలిపెట్టలేదు. ఆ మేరకు ఇందిరాగాంధీ హయాంలో ‘కట్టుబాటుతో పనిచేసే న్యాయవ్యవస్థ’ కోసం కాంగ్రెస్‌‌ పిలుపునిచ్చింది. చివరకు అలాంటి వ్యవస్థ సృష్టికీ సిద్ధమైంది. న్యాయమూర్తులను పక్కకు నెట్టి, తమ చెప్పుచేతల్లో ఉండేవారిని నియమించే దిశగా మాటవినని, తమ దారిలో నడవని జస్టిస్‌‌ హెచ్‌‌ఆర్‌‌ ఖన్నా వంటి న్యాయమూర్తులను కఠినంగా శిక్షించింది. కాంగ్రెస్‌‌లో పదవులు, న్యాయ నియామకాల మధ్య ఎలాంటి పరితాపం లేకుండా గుడుగుడుగుంచం ఆడిన జస్టిస్‌‌ బహరుల్‌‌ఇస్లాం ఉదంతం ఇందుకు గల నిదర్శనాల్లో ఒకటి. ఇక సోనియాగాంధీ హయాంలో ప్రధాన న్యాయమూర్తులు పద్ధతీపాడూ లేకుండా ఇష్టానుసారం బదిలీలు అయ్యేవారు. దీనినే జడ్జిలలో భయాందోళనలు సృష్టించేందుకు పద్ధతి ప్రకారం చేపట్టిన ప్రయత్నంగా దివంగత నేత అరుణ్‌‌జైట్లీ అభివర్ణించారు. 
కాంగ్రెస్‌‌ అధికారదాహ ప్రవృత్తి నేటికీ సజీవం
రాజకీయ ప్రత్యర్థుల పట్ల కాంగ్రెస్‌‌ ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే. ఉత్తుంగ శిఖరం వంటి అటల్‌‌ బిహారీ వాజ్‌‌పేయి వంటి మహా నాయకుడిని సాక్షాత్తూ సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌‌ అత్యంత నీచంగా విమర్శించింది. దీనికి భిన్నంగా పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌‌ నేత గులాంనబీ ఆజాద్‌‌ నిష్క్రమణ సమయంలో ప్రధాని మోడీ భావోద్వేగ ప్రసంగం, ఆయన కంటతడి పెట్టడం బీజేపీ పాటించే విలువలకు ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి కాంగ్రెస్‌‌ నిరంకుశత్వం, అధికార దాహ ప్రవృత్తికి, కాంగ్రెస్‌‌ వ్యతిరేక శక్తుల ప్రజాస్వామ్య దృక్కోణానికీ మధ్యగల ప్రధాన వ్యత్యాసాలను విస్మరించరాదు. ఆనాడు ఎమర్జెన్సీ విధింపునకు దారి తీసిన కాంగ్రెస్‌‌ దుర్లక్షణాలు నేటికీ సజీవమేగాక, ఎప్పుడైనా పెల్లుబికే స్థితిలో ఉన్నాయి. కేంద్రంలో రాజకీయ అధికారం దక్కే అవకాశం ఆ పార్టీకి ఎంతమాత్రం లేకపోవడమే అందుకు కారణం. ఈ పరిస్థితి ఇలా కొనసాగడమే దేశానికి మంచిది.
అట్టడుగుకు దిగజారినా మార్పు రాలేదు
కాంగ్రెస్‌‌ పార్టీ అట్టడుగు స్థాయికి దిగజారిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ దాని నిరంకుశ, క్రూర ప్రవృత్తిలో మార్పు రాలేదు. ఆ మేరకు కోర్టుల ద్వారా కాంగ్రెస్‌‌ క్షుద్ర రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వలేదన్న కక్షతో ఒక ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించడానికి రాహుల్‌‌గాంధీ ప్రయత్నించారు. రాహుల్‌‌గాంధీ వంటి వరుస ఎన్నికల వైఫల్యాల నాయకుడి డిఫాక్టో లీడర్​షిప్​ను ఎవరైనా అంగీకరించకపోతే ఇటీవలి ‘జి-23’ తరహాలో వారు పక్కకు నెట్టబడతారు. రాజస్థాన్‌‌, పంజాబ్‌‌ రాష్ట్రాల్లో తమ పార్టీలోని బలమైన ప్రాంతీయ నాయకుల స్థాయిని కుదించేందుకు అంతర్గత కుమ్ములాటలను నెహ్రూ-గాంధీ కుటుంబం ఆయుధంగా వాడుకుంటోంది. తమకన్నా ఓ కుక్కపై కాంగ్రెస్‌‌ తొలి కుటుంబం ఎక్కువ శ్రద్ధ చూపుతుందంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌ను వీడిపోతున్నారు.

విలువలకే ప్రధాని మోడీ తొలి ప్రాధాన్యం
కాంగ్రెస్‌‌ నీతిమాలిన విధానాలకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నిటికన్నా దేశానికే ఎక్కవ ప్రాధాన్యం ఇస్తారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వెళ్లడంకన్నా అధికారం వదులుకునే బీజేపీ సంప్రదాయమే ఈ వైఖరికి మూలం. అన్నిటికన్నా అధికారానికే కాంగ్రెస్‌‌ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండగా, జమ్ముకాశ్మీర్‌‌లో సంకీర్ణ ప్రభుత్వం డీడీసీ ఎన్నికలను అడ్డుకుంటున్న పరిస్థితుల నడుమ ప్రధానమంత్రి మోడీ ఆ సంకీర్ణం నుంచి వైదొలగాలని నిర్ణయించారు. రాజకీయ అధికారంకన్నా ప్రజాస్వామ్య మూలాలకు ప్రాధాన్యం ఇచ్చారనడానికి ఇదొక నిదర్శనం. అలాగే ప్రధాని మోడీ నాయకత్వంలోనే వస్తుసేవల పన్ను(జీఎస్టీ) మండలిలో రాష్ట్రాల ప్రాధాన్యం ద్వారా సహకారాత్మక సమాఖ్య విధానం కొత్త మైలురాయిని చేరింది. అదేవిధంగా సీబీఐ నియామకాల వంటి కీలక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడి హాజరుకు వీలుగా  నిబంధనలు కూడా సడలించారు.