
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్, వెలుగు: విమాన ప్రయాణంలో ఉన్న ఓ మహిళ గుండెపోటుతో చనిపోయింది. ఖతార్ రాజధాని దోహా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున క్యూఆర్642 ఫ్లైట్ దోహా నుంచి బంగ్లాదేశ్ బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత విమానంలో బంగ్లాదేశ్‌కు చెందిన బేగం రోషనారా (44) కు గుండెపోటు రావడంతో వెంటనే సిబ్బంది పైలట్‌కు సమాచారం ఇచ్చారు.
పైలట్ శంషాబాద్ ఏటీసీకి సమాచారం అందించి, చికిత్స కోసం అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. రోషనారాను వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆ మహిళ వెంట ఆమె కుమారుడు ఉన్నాడు. మహిళా మృతి చెందిన విషయాన్ని అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.