యాదాద్రి కాంగ్రెస్​లో భగ్గుమన్న అసమ్మతి: కుంభం అనిల్​కుమార్​రెడ్డి

యాదాద్రి కాంగ్రెస్​లో  భగ్గుమన్న అసమ్మతి: కుంభం అనిల్​కుమార్​రెడ్డి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా  కాంగ్రెస్​లో అసమ్మతి భగ్గుమంది. డీసీసీ ప్రెసిడెంట్​ కుంభం అనిల్​కుమార్​రెడ్డికి వ్యతిరేకంగా సోమవారం రాత్రి అత్యవసరంగా మీటింగ్​ ఏర్పాటు చేసుకొని ఆయనపై విమర్శలు గుప్పించారు. కుంభం వల్ల కాంగ్రెస్​ నష్టపోతున్నదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి టికెట్​ ఇచ్చే విధంగా అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు.  భువనగిరి, బీబీనగర్​, వలిగొండ, పోచంపల్లి మండలాలకు చెందిన పలువురు లీడర్లు మేడ్చల్​ రంగారెడ్డి జిల్లా ఘట్​కేసర్​లో మీటింగ్​ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్​లో పలువురు లీడర్లు మాట్లాడారు. మంత్రి హరీశ్​రావుతో కుంభం  చర్చలు జరుపుతున్నాడని, ఏ క్షణమైనా ఆయన కాంగ్రెస్​ను వీడిపోతారని అభిప్రాయపడ్డారు. ఆయనకు బీ ఫారం ఇచ్చిన మరుక్షణమే.. బీఆర్​ఎస్​లోకి వెళ్లిపోతారని స్పష్టం చేశారు.

ALSO READ: కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర

 చర్చలు జరుపుతున్న విషయం టీపీసీసీకి సమాచారం ఉందని మీటింగ్​లో వెల్లడించారు. కుంభం వెంట ఎవరూ లేరని, ఆయనకు బిజినెస్​ తప్ప మరొకటి తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఆయన దగ్గరకు వెళ్లి  సలహా ఇచ్చినా పట్టించుకోరని కామెంట్​ చేశారు.'ఆయన దగ్గరకు వెళ్తే పట్టించుకోరు. ఏదైనా విషయం చెప్పితే వినిపించుకోరు. కేసీఆర్​ వద్దకు పోతే ఎలా కాళ్లు మొక్కుతారో..? కుంభం వద్దకు పోయినా ఆయన కాళ్లు, ఆయన భార్య కాళ్లు, చివరకు కూతురు కాళ్లు కూడా మొక్కాలి' అంటూ ఓ లీడర్​ కామెంట్ ​ చే శారు. రెడ్డి సామాజిక వర్గంలో కుంభం అనిల్​కుమార్​ రెడ్డికి సంబంధించిన 'మటాడి' ఓట్లు అతి తక్కువగా ఉన్నాయని, అదే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికి సంబంధించిన 'గుటాడి' ఓట్లు 25 వేలకు పైగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కుంభం 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి బీసీలకు టికెట్​ ఇస్తే.. కాంగ్రెస్​ గెలుపు ఖాయమన్నారు. ఈసారి బీసీలకు టికెట్​ ఇప్పించుకోవడానికి అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్​లో  పోత్నక్​ ప్రమోద్​కుమార్​, రామాంజనేయులు గౌడ్​, అనంతరెడ్డి, కృష్ణారెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.