జాతీయ అత్యవసర పరిస్థితి.. రాష్ట్రపతి విశిష్ట అధికారాలు

 జాతీయ అత్యవసర పరిస్థితి.. రాష్ట్రపతి విశిష్ట అధికారాలు

భారతదేశం ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే సందర్భంలోనూ, దేశం ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొనే సందర్భంలోనూ, విదేశీ దురాక్రమణ, దేశంలో సాయుధ తిరుగుబాటు వంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం రాజ్యాంగంలోని 18వ భాగంలోని 352–360 వరకు గల అధికరణల్లో అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అధికారాలను పొందుపర్చారు. 

భారత రాజ్యాంగం అత్యవసర అధికారాలను భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించింది. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు పాటించే పద్ధతులను జర్మనీ నుంచి గ్రహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే పద్ధతిని జర్మనీ నుంచి, జీవించే హక్కు రద్దు చేయకుండా ఉండే పద్ధతిని జపాన్ నుంచి గ్రహించారు. రాష్ట్రపతి మూడు రకాల అత్యవసర అధికారాలను కలిగి ఉన్నారు. 352వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తారు. విదేశీ దురాక్రమణ, విదేశాలతో యుద్ధం నెలకొన్నప్పుడు, బహిర్గత కారణాలతోనూ అలాగే ఆంతరంగిక అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆంతరంగిక కారణాల దృష్ట్యా రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. 

కాల పరిమితి

రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి వెంటనే అమలులోకి వస్తుంది. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించిన తేదీ నుంచి ఆరు నెలల వరకు అమలులో ఉంటుంది. భారత పార్లమెంట్ మరో తీర్మానం ద్వారా ఆరు నెలల చొప్పున ఎంతకాలమైనా పొడగించవచ్చు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితికి ఎలాంటి గరిష్ట కాలపరిమితి లేదు. 

అత్యవసర పరిస్థితి రద్దయ్యే సందర్భాలు

ఆరు నెలలకు ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన ద్వారా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. పార్లమెంట్​ఒక సాధారణ తీర్మానం ద్వారా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్​లో ఒక నెలలోపు ఆమోదించకపోయినా అత్యవసర పరిస్థితి రద్దవుతుంది. 

44వ సవరణ ద్వారా మార్పు

44వ సవరణను అనుసరించి లోక్​సభలోని 1/10వ వంతు సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితి రద్దు కోరుతూ ఒక నోటీసును లోక్​సభ స్పీకర్​కు రాష్ట్రపతి అందజేయవచ్చు. 14 రోజుల ముందు ఇచ్చే ఈ నోటీసును అనుసరించి లోక్​సభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సాధారణ మెజారిటీతో ఈ తీర్మాన ఆమోదంతోనూ రద్దు చేయవచ్చు. 

అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించే మార్పులు

353వ అధికరణ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించి, అమలు చేయాలి.

354వ అధికరణ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థికపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ ఆదేశాలు ఒక సంవత్సర కాలంపాటు అమలులో ఉంటాయి.

250వ అధికరణ: రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏ అంశంపైననూ శాసనం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. 

358వ అధికరణ: 19వ అధికరణ సహజంగానే సస్పెండ్ అవుతుంది. 1978లో జనతా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం విదేశీ కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే 19వ అధికరణ సహజంగా సస్పెండ్ అవుతుంది. అంతర్గత కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 19వ అధికరణ సహజంగానే సస్పెండ్ కాదు. 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతి ప్రత్యేక ప్రకటన చేసి 19వ అధికరణను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనిపై పార్లమెంట్ చర్చ చేసి ఆమోదించాల్సి ఉంటుంది. 

359వ అధికరణ: రాష్ట్రపతి 20, 21 అధికరణల్లో పొందుపర్చిన హక్కులను మినహాయించి మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. 

ఉన్నత న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలు విషయంలో సంరక్షణ కోసం రిట్లను జారీ చేసే సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలపై పార్లమెంట్ చట్టబద్ధ పరిమితులు విధించవచ్చు. 

లోక్​సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని అదనంగా ఒక సంవత్సర కాలం ఒక్కసారి మాత్రమే పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. 

జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రూపొందించిన చట్టాలు అత్యవసర పరిస్థితి కాలం ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు అమలులో ఉంటాయి. ఒకవేళ పార్లమెంట్ వాటిని మధ్యలోనే రద్దు చేయవచ్చు. లేకుంటే ఆరు నెలల తర్వాత వాటంతటవే రద్దయిపోతాయి. 

జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశంపై కేంద్రం చేసిన శాసనాలను అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత రాష్ట్రాలు రద్దు చేసుకోవచ్చు. 

44వ సవరణ ద్వారా చేర్చిన, మార్చిన అంశాలు

జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ప్రభుత్వం కూడా దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడాన్నే కఠినతరం చేయడానికి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం అనేక మార్పులను తీసుకువచ్చింది. అల్లకల్లోల పరిస్థితులు అనే పదానికి బదులుగా సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చింది. 

విదేశీ కారణాలు లేదా అంతర్గత కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలని కోరుతూ కేంద్ర క్యాబినేట్ ఒక లిఖితపూర్వకమైన సలహా ద్వారా రాష్ట్రపతికి సిఫారసు చేయాలి.

కేంద్ర క్యాబినేట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరంలేదు. అంటే పున: పరిశీలనకు వెనక్కి పంపవచ్చు. కానీ, కేంద్ర క్యాబినేట్ రెండోసారి ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. 

44వ సవరణ ద్వారా క్యాబినేట్ అనే పదాన్ని 352 అధికరణలో మొదటిసారిగా చేర్చారు. లిఖితపూర్వక సలహా అనే పదాన్ని కూడా చేర్చారు. 

44వ సవరణ ద్వారానే రాష్ట్రపతి చేసిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఉభయ సభలు నెలలోగా ఆమోదించాలి. ఇంతకుముందు పార్లమెంట్ రెండు నెలల్లోగా ఆమోదం తెలపాల్సి ఉండేది. 

ఉభయ సభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. దీనిని కూడా 44వ సవరణ ద్వారానే చేర్చారు. 

రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో ఒకవేళ లోక్​సభ రద్దయి ఉన్నట్లయితే దానిని రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలి. నూతన లోక్ సభ ఏర్పడి మొదటి సమావేశం జరిపిన తేదీ నుంచి 30 రోజుల్లోగా లోక్ సభ ఆమోదించాలి లేకపోతే అత్యవసర పరిస్థితి రద్దవుతుంది. 

రాష్ట్రపతి ప్రకటనను ఆమోదించే విషయంలో ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు అత్యవసర పరిస్థితి రద్దవుతుంది.

ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. 

అత్యవసర పరిస్థితులు విధించిన సందర్భాలు
 
– 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా నెహ్రూ ప్రభుత్వ కాలంలో మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఇది 1968, జనవరి 10 వరకు కొనసాగింది. 1965ల పాకిస్తాన్​తో యుద్ధం సందర్భంగా మన దేశంలో ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితి విధించలేదు. 

– 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంలో పాకిస్తాన్ తో యుద్ధం, ఇందిరాగాంధీ ప్రభుత్వం మన దేశంలో రెండోసారి అత్యవసర పరిస్థితి విధించగా ఇది 1977 వరకూ కొనసాగింది. 

– 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆంతరంగిక భద్రత పేరుతో అత్యవసర పరిస్థితిని విధించింది. 1975 నుంచి 1977 వరకూ మన దేశంలో రెండు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితులు అమలులో ఉండటం గమనార్హం.