Ind vs Pak Final: అంపైర్లపై ఫిక్సింగ్ ఆరోపణలు.. ఈ వార్తల్లో నిజమెంత?

Ind vs Pak Final: అంపైర్లపై ఫిక్సింగ్ ఆరోపణలు.. ఈ వార్తల్లో నిజమెంత?

ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ ఫైన‌ల్ పోరులో భార‌త యువ జ‌ట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కొలంబో వేదికగా ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో జరిగిన తుది పోరులో 128 ప‌రుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 352 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 224 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో పాకిస్థాన్ యువ జ‌ట్టు వ‌రుస‌గా రెండోసారి చాంపియ‌న్‌గా నిలిచింది. 

అయితే ఈ మ్యాచ్‌ను ఫిక్సింగ్ భూతం కమ్మేసినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. అందుకు పాక్ ఆటగాళ్లు, ఆ జట్టు అఫిషియల్స్.. అంపైర్లతో ప్రవర్తించిన తీరే కారణం. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆఫ్‌ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్ళతో సంభాషించడం అన్నది జరగదు. ఏదేని అనుకోని సంఘటనలు జరిగిన సమయంలోనూ లేదా వర్షం అంతరాయం కలిగించిన సందర్భాల్లో ఇరు జట్ల కెప్టెన్లు ఆఫ్‌ఫీల్డ్‌లో అంపైర్లతో చర్చిస్తుంటారు. కానీ ఈ మ్యాచ్‌లో ఓ  పాకిస్తాన్ ఆటగాడు.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆఫ్‌ఫీల్డ్ అంపైర్‌తో మాట్లాడుతూ కనిపించటం ఫిక్సింగ్ అనుమానాలను బలపరుస్తోంది.

అనంతరం మ్యాచ్ ముగిశాక.. పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అఫిషియల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సలీం నసీర్.. అంపైర్లకు షీల్డులు బహుకరించటం మరింత అనుమానాలు కలిగిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్న అభిమానులు.. ఈ మ్యాచ్‌ను ఫిక్సింగ్ భూతం కమ్మేసిందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోణపణలపై ఐసీసీ ఎలాంటి వివరణ ఇవ్వనుందో వేచి చూడాలి. 

కాగా ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ నికిన్ జోస్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగా.. అల్ట్రా ఎడ్జ్‌లో ఎలాంటి స్పైక్ కనిపించకపోవడం గమనార్హం.  అంపైర్లు.. పాక్ జట్టుకు అనుకూలంగా వ్యవహరించారని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.