Ind vs Pak Final: తేలిపోయిన భారత యువ ఆటగాళ్లు.. ఆసియా కప్ విజేత పాకిస్తాన్

Ind vs Pak Final: తేలిపోయిన భారత యువ ఆటగాళ్లు.. ఆసియా కప్ విజేత పాకిస్తాన్

ప్రతిష్ఠాత్మక ఎమర్జింగ్ ఆసియా కప్‌ 2023 టోర్నీ ఫైనల్‌లో భారత యువ ఆటగాళ్లు తేలిపోయారు. మొదట బౌలింగ్‍లో విఫలమైన భారత యువ జట్టు.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయింది. పాక్ నిర్ధేశించిన 352  పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 224 పరుగులకే కుప్పకూలింది. దీంతో దాయాది జట్టు పాకిస్తాన్ ఆసియా కప్ ఎగరేసుకుపోయింది.   

ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ చేసింది. తాహిర్ (108; 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులు) శతకంతో చెలరేగగా, ఫర్హాన్ (65), సైమ్ అయుబ్ (59) అర్ధ శతకాలతో రాణించారు. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తోన్న టీమిండియా బౌలర్లు తీరా ఫైనల్‌ పోరులో చేతులెత్తేశారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం 353 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 40 ఓవర్లలో 224 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ(61) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. సాయి సుదర్షన్(29), నికిన్ జోస్ (11), యష్ ధుల్(39), ధృవ్ జురెల్(9), నిశాంత్ సంధు(10), రియాన్ పరాగ్(14).. ఇలా ఒకరి వెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. పాక్ బౌలర్లలో ముఖీమ్ మూడు వికెట్లు తీసుకోగా.. అర్షద్ ఇక్బాల్, ముంతాజ్, వసీం జూనియర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.