- 200కుపైగా సినిమా పాటలు..
- 40కి పైగా నృత్యరూపకాలు
- 25 ప్రక్రియల్లో రచనలు చేసిన ఏకైక రచయిత గా గుర్తింపు
- రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.అమెరికాలో ఆటా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన కృష్ణ.. ఆరోగ్యం దెబ్బతినడంతో జులై 16న హైదరాబాద్ వచ్చి, ఆసుపత్రిలో చేరారు.
నెల రోజుల పాటు చికిత్స పొందిన ఆయన 4 రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. గురువారం మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా.. శుక్రవారం ఉదయం మృతిచెందారు. రెండు రోజుల కిందటే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణకు జీవనసాఫల్య పురస్కారాన్ని అందించింది.
చేనేత కుటుంబం నుంచి ఎదిగిన వడ్డేపల్లి
వడ్డేపల్లి కృష్ణ.. సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. తపాలాశాఖలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ నాగోల్ లో స్థిరపడ్డారు. పిల్ల జమీందార్, పెద్దరికం, భైరవద్వీపం తదితర సినిమాలకు పాటలు రాశారు. సినీ గేయ రచయితగా తనదైన ముద్ర వేసుకున్నారు. 25 ప్రక్రియల్లో రచనలు చేసిన ఏకైక రచయిత గా ఆయనకు పేరుంది. వందేండ్లలో వెలువడిన పదివేల లలిత గీతాలపై ఆయన పీహెచ్డీ చేశారు.
ఆయన రాసిన వందలాది లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. 40కి పైగా నృత్యరూపకాలు రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన రూపొందించిన ‘జయ జయహే తెలంగాణ’ నృత్య రూపకాన్ని అనేక వేదికలపై ప్రదర్శించారు. ఆయనకు భార్య మణెమ్మ , ఇద్దరు కుమారులు శ్రీనాథ్, శ్రీకాంత్, కుమార్తె వాణి ఉన్నారు. పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. వారు వచ్చిన తర్వాత కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పిల్ల జమీందార్‌తో సినీ ఇండస్ట్రీకి పరిచయం
భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ సినిమాతో వడ్డేపల్లి కృష్ణ రైటర్‌గా మారారు. అయితే ఈ సినిమా ఆలస్యంగా విడుదలవడం.. దీని తర్వాత ఆయన రైటర్‌గా వర్క్ చేసిన ‘పిల్ల జమీందార్’ (1980) ముందు రిలీజ్ అవడంతో ఈ చిత్రంతోనే ఆయన పరిచయమైనట్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటివరకు వడ్డేపల్లి దాదాపు 200కుపైగా పాటలు రాశారు.
పిల్ల జమీందార్, పెద్దరికం, భైరవ ద్వీపం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి చిత్రాలు.. రచయితగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంతో వడ్డేపల్లి కృష్ణ ప్రఖ్యాతి గాంచారు. రచయితగానే కాకుండా 2 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ చిత్రానికి ఆయన డైరెక్షన్ చేశారు. ఇందులో సాయి కుమార్ హీరోగా నటించారు. 2017 లో ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’ సినిమాను డైరెక్ట్ చేశారు.
ఇక తెలంగాణ నేపథ్య కథతో రూపొంది, విజయాన్ని అందుకున్న ‘బలగం’ చిత్రంలో వడ్డేపల్లి కృష్ణ కీలకపాత్రలో కనిపించారు. గోవులపై ఆయన రూపొందించిన ‘గోభాగ్యం’ అనే షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో బహుమతులు గెలుచుకున్నది. బతుకమ్మ, రామప్ప రామణీయం షార్ట్ ఫిల్మ్‌లకు నంది అవార్డులు వచ్చాయి. అలాగే, ఆత్మహత్య, నేతన్నలు వంటి డాక్యుమెంటరీలను తీసి, జాతీయస్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు.
కృష్ణ మృతికి జూపల్లి సంతాపం
హైదరాబాద్, వెలుగు : రచయిత వడ్డేపల్లి కృష్ణ మరణం పట్ల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గీత రచయితగా, టీవీ సీరియళ్ల దర్శకుడిగా, పుస్తకాలు, సంగీత, నృత్య రూపకాల రచయితగా కృష్ణ చేసిన సేవలను మంత్రి కొనియాడారు. వడ్డేపల్లి కృష్ణ మరణం తెలుగు టీవీ రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటని అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.