-
ఓ అభ్యర్థి ఓట్లు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటనని బెదిరించారు
-
అలాంటి వాళ్లపై ఈసీ చర్య తీసుకోవాలి
-
పరోక్షంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించిన గవర్నర్ తమిళిసై
-
బిల్లుల ఆమోదంపై గతంలో తమిళిసైని దూషించిన ఎమ్మెల్యే పాడి
-
జాతీయ మహిళా కమిషన్ విచారణ.. సర్దుకొని సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: ఓట్ల కోసం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం కరెక్ట్ కాదన్నారు . అలాంటి వారిపై ఈసీ చర్య తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యం బతకాలంటే అందరూ ఓటు వేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఇవాళ (జనవరి25) కూకట్ పల్లిలోని జేఎన్టీయూహెచ్ లో జరిగిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో భాగంగా తనకు ఓటు వేసి గెలిపించకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బహిరంగ సభల్లో పేర్కొనడంతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. గవర్నర్ తమిళిసై ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.
గతంలో గవర్నర్ పై పాడి అనుచిత వ్యాఖ్యలు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా పాడి కౌశిక్ రెడ్డి పేరును గత ప్రభుత్వం ప్రతిపాదించగా తమిళిసై తిరస్కరించారు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ఎన్నుకుంది. అప్పటి నుంచి పాడి గవర్నర్ పై అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. గత ఏడాది ఇదే రోజున ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాష్ట్ర రాజకీయాలు మారాయి. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు కింద పెట్టుకొని కూర్చుంటారా..’అంటూ అనుచిత పదజాలాన్ని వాడారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది.
గతేడాది ఫిబ్రవరి 21న అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ జాతీయ మహిళా కమిషన్‌ను క్షమాపణలు కోరారు. మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతూ గవర్నర్ తమిళిసైకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తానని వివరించారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంశానికి పరోక్షంగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రస్తావించడంతో ఈ అంశం మరో మారు చర్చనీయాంశంగా మారింది.