యాదాద్రిలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో 16 డిపార్ట్​మెంట్లకు చెందిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముగిసింది.  ప్రభుత్వ ఉత్తర్వులు నెం.80 ప్రకారం ఈనెల 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో నాలుగేండ్లు పైబడి కొనసాగుతున్న జూనియర్​ అసిస్టెంట్​నుంచి కింది స్థాయి ఉద్యోగులు బదిలీ కోసం ఇదివరకే  ఆప్షన్లు చేసుకున్నారు.

కాగా గురువారం యాదాద్రి కలెక్టరేట్లో రెవెన్యూ, ఎస్సీ వెల్ఫేర్, జిల్లా పరిషత్, పంచాయతీ డిపార్ట్​మెంట్లకు చెందిన ఉద్యోగులకు కలెక్టర్​హనుమంతు జెండగే, అడిషనల్​కలెక్టర్​బెన్​షాలోమ్​ నేతృత్వంలో కౌన్సిలింగ్​ నిర్వహించారు. సీనియార్టీ ఆధారంగా 187 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.

మొత్తంగా జిల్లాలో 238 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. కౌన్సిలింగ్​లో జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి జయపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.