కేసీఆర్‌‌‌‌ పాలనలో ఆగమైన ఉద్యోగులు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అపూర్వమైనది. విద్యార్థుల ఎట్ల తెగించి కొట్లాడిన్రో.. ఉద్యోగులూ అదే స్థాయిలో పోరాటం చేశారు. సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు విధులను బహిష్కరించి వారు చేసిన ఉద్యమం యావత్‌‌‌‌ తెలంగాణ ప్రజల్లో ఉత్సాహం నింపింది. సొంత రాష్ట్రం కలసాకారమైతే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్యోగుల ఆశలు నేటికీ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే ఉద్యోగులను ‘‘కూరలో కరివేపాకులా’’ కేసీఆర్‌‌‌‌ పక్కన పెట్టేశారు.


ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు లేవనెత్తిన అనేక సమస్యలు స్వరాష్ట్రంలోనూ కొనసాగడం ఉద్యోగులపై కేసీఆర్‌‌‌‌ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. తమ న్యాయమైన సమస్యలను ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతీసారి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రజాస్వామిక నిరసనలను ఏనాడూ సహించని కేసీఆర్‌‌‌‌ ఉద్యోగుల పట్ల కూడా అదే నియంతృత్వ పోకడలను అవలంబిస్తున్నారు. తన తాబేదార్లుగా ఉన్న కొన్ని ఉద్యోగ సంఘాలను ఉపయోగించుకుని మొత్తం ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు, జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి1000 మందికి14 మంది ఉద్యోగులు ఉండాలని వివిధ అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. కాని ఈ సంఖ్య రాష్ట్రంలో 8.5 శాతంగానే ఉన్నది. దీంతో ఉన్న ఉద్యోగులకు పనిభారం పెరుగుతోంది. ఈ పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. 
 

ఫీల్డ్​అసిస్టెంట్లను తీసుకోరా?
తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మొదటి పీఆర్సీ కమిషన్‌‌‌‌(చైర్మన్‌‌‌‌ బిస్వాల్‌‌‌‌) నివేదిక ప్రకారం1 లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ప్రభుత్వం 80,039 పోస్టులు మాత్రమే భర్తీచేస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంది. కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు 50 వేల మంది వరకు ఉండగా కేవలం11వేల ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేయనున్నట్లు చెప్పింది. 7,651 మంది ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీసాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వాగ్దానానికి ఇప్పటివరకు అతీగతీలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 4,500 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన సర్కారు.. ఆ పంచాయతీల్లో ఇప్పటి వరకు ఫీల్డ్ అసిస్టెంట్లను రిక్రూట్‌‌‌‌ చేయలేదు. దీంతో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ భారమంతా గ్రామపంచాయతీ కార్యదర్శులపై పడి వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
 

సీపీఎస్ రద్దు ఏమాయే?
సీపీఎస్‌‌‌‌ను రద్దుచేసి పాతపెన్షన్‌‌‌‌ విధానాన్నే అమలు చేయాలని ఉద్యోగులు ముఖ్తకంఠంతో కోరుతున్నారు.  పాతపెన్షన్‌‌‌‌ విధానం అమలుకు కృషిచేస్తామని కేసీఆర్‌‌‌‌ ప్రకటించినా.. నేటికీ అది అమలుకు నోచుకోలేదు. సీపీఎస్‌‌‌‌ అమలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఈ విషయంలో తమ పాత్ర ఏమీలేదని రాష్ట్రప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. పాత పెన్షన్‌‌‌‌ విధానం అమలు విషయంలో రాష్ట్రప్రభుత్వాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. న్యాయస్థానాల తీర్పులూ ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాతపెన్షన్‌‌‌‌ విధానాన్నే అమలు చేస్తామని ఇప్పటికే  ప్రకటించాయి. అయినా రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాలు, పెన్షనర్ల జీవితాలతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ప్రతినెలా1వ తారీఖు కోసం ప్రభుత్వ ఉద్యోగి ఆశగా ఎదురుచూస్తాడు. ముందటి నెల తన కష్టార్జితం1వ తారీఖున బ్యాంకులో పడుతుందని, కానీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్‌‌‌‌ కనీసం10వ తారీఖు వరకు కూడా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారు. అది కూడా ప్రతినెలా విడతలవారీగా, జిల్లాల రొటేషన్‌‌‌‌ పద్ధతిలో వేతనాలు జమ చేస్తున్నారు.
 

పెన్షన్​దారుల ఇబ్బందులు
2018లో రావాల్సిన పీఆర్సీ నివేదిక 2021లో వచ్చింది. నివేదిక సిఫార్సులు అమలు, ఉద్యోగుల సమంజసమైన సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. పీఆర్ సీ అమలు కాలం నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన 36 నెలల వేతనాన్ని వారి రిటైర్‌‌‌‌మెంట్‌‌‌‌ సమయంలో ఇస్తామని ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసింది. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు లెక్కించి ఇవ్వాల్సిన కరువు భత్యం(డిఏ)నూ ప్రభుత్వం పెండింగ్‌‌‌‌లో పెట్టింది. ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మూడు కరువుభత్యం అలవెన్సులు ఇవ్వనే లేదు. పీఆర్సీ, కరువుభత్యం అలవెన్సులు సక్రమంగా అందకపోవడంతో సుమారు 2 లక్షల మంది రిటైర్డ్ ప్రభుత్వ పెన్షన్‌‌‌‌దారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలే సకాలంలో అందని పరిస్థితి ఉంటే.. పెన్షన్‌‌‌‌దారుల పరిస్థితి దారుణంగా తయారైంది. పెన్షన్‌‌‌‌ మీదనే బతుకీడ్చే కుటుంబాల కష్టాలు వర్ణాతీతం. ఉద్యోగుల, పెన్షన్‌‌‌‌దారుల ఈ కష్టాలన్నింటికీ కేసీఆర్‌‌‌‌ అసమర్థ 
విధానాలే కారణం.
 

టీచర్ల సమస్యలపై స్పందనేది?
ఉపాధ్యాయులు ప్రమోషన్లు, బదిలీలకోసం ఏండ్ల తరబడి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేటికీ ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. బదిలీల షెడ్యూల్.. నేడు, రేపు అంటూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. జీ.వో.నెం.317తో తెలంగాణ ఉద్యోగులను తమ సొంత ప్రాంతంలోనే స్థానికేతరులగా మార్చిన ఘనత కేసీఆర్‌‌‌‌కే దక్కుతుంది. 577 ఎంఈవో, 62 డిప్యూటీ డీఈవో, 23 డీఈవో పోస్టులు ఖాళీగా ఉంటే విద్యారంగం ఎట్లా గాడిన పడుతుందో కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం చెప్పాలి. 317 జీవోకు సవరణలు చేపట్టి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలి. ఉపాధ్యాయుల ప్రమోషన్లతో పాటే భాషాపండితులు, పీఈటీల పోస్టుల అప్‌‌‌‌గ్రేడేషన్‌‌‌‌ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే టీచర్లను రెగ్యులర్‌‌‌‌ చేసి, పేస్కేల్‌‌‌‌ అమలుచేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, మధ్నాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలలకు అవసరమైన నిధులు కేటాయించాలి. బేషజాలకు పోకుండా కేంద్రం నుంచి పాఠశాల విద్యకు వస్తున్న నిధులను ఉపయోగించి ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమాన్ని విద్యార్థుల భవిష్యత్‌‌‌‌కు దోహదపడేవిధంగా అమలు చేయాలి.  ప్రభుత్వ పాలనలో భాగమైన ఉద్యోగులపట్ల, వారి న్యాయమైన సమస్యల పట్ల అహంకార పూరితంగా కాకుండా, ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
 

ఆర్టీసీ ఉద్యోగుల హామీలు గుర్తున్నాయా?
ఆర్టీసీ మనుగడకోసం అందులోని ఉద్యోగులు, కార్మికులు 55 రోజులపాటు చేసిన ఉద్యమం పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నియంతృత్వం అందరి కళ్లముందూ ఇంకా కదలాడుతూనే ఉంది. తమను కాదని ఉద్యోగ, కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడమే ఏలినవారి ఆగ్రహానికి కారణం. చివరికి ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోయినా ప్రభుత్వం చలించలేదు. చాలా కర్కషంగా వ్యవహరించింది. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం, ఉద్యోగ కార్మిక సంఘాలను విచ్చిన్నం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్​సర్కారు వ్యవహరించింది. ఉద్యోగ సంఘాలను రద్దుచేసి వెల్ఫేర్‌‌‌‌ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చకుండా అటకెక్కించారు. సమ్మెకాలంలో ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బూటకమని తేలిపోయింది. ఆర్టీసీలో1,189 కోట్ల పీఎఫ్‌‌‌‌ బకాయిలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి రూ.746 కోట్లు ఉండటం గమనార్హం. ఆర్టీసీలో మరణించిన 435 మంది ఉద్యోగులకు డిపాజిట్‌‌‌‌ లింక్డ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ స్కీం కింద చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదు. తొమ్మిదేండ్ల నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ లేదు. గత పీఆర్సీ ఏరియర్స్‌‌‌‌ ఇప్పటికీ పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి. అర్ధాకలితో ఆర్టీసీ కార్మికులు బతుకు చక్రాలు లాగుతుంటే.. ప్రగతి భవన్‌‌‌‌ మాత్రం కళకళలాడుతోంది. ప్రభుత్వ ఖాళీలు భర్తీచేసి తమపై పని ఒత్తిడి తగ్గించాలని ఉద్యోగులు కోరితే దాన్ని ప్రభుత్వం నేరంగా చూస్తోంది. ఇంటికో ఉద్యోగం అన్న టీఆర్ఎస్​ఎన్నికల హామీని ఇప్పటికీ అమలు చేయలేదు. కానీ కేసీఆర్‌‌‌‌ తమ కుటుంబంలో ఐదు మందికి ప్రభుత్వ పదువుల ఇచ్చుకొని ప్రజల సొమ్మును దర్జాగా తినేస్తున్నారు.


పోరాటంతోనే..
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ వేతనాలు173 శాతం పెంచుకున్నారు. మరి సకాలంలో పీఆర్సీలు వేయాలని, పెండింగ్‌‌‌‌ లేకుండా బకాయిలు చెల్లించాలని, తమ కృషి, సీనియార్టీకి తగిన గౌరవప్రదమైన హోదా కావాలని ఉద్యోగులు కోరుకోవడంలో తప్పేముంది. అవసరం తీరాక తెప్పతగలేసినట్లు ఉన్నది ఉద్యోగుల పట్ల టీఆర్ఎస్​ప్రభుత్వ వైఖరి. ప్రశ్నించే సంఘాలను, ఉద్యోగులను బెదిరించడం, తమకు భజన చేసేవారికి పదవులు ఇచ్చి అక్కున చేర్చుకోవడం కేసీఆర్‌‌‌‌కు వెన్నతో పెట్టిన విద్య. ఉద్యోగుల సంఘటిత చైతన్యంతోనే కేసీఆర్‌‌‌‌ నియంతృత్వ విధానాలను తిప్పికొట్టగలం. తమ న్యాయమైన హక్కులకోసం భవిష్యత్తులో ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులు చేసే పోరాటాలకు బీజేపీ పూర్తి అండగా ఉంటుంది. రానున్నకాలంలో జీ.వో.నెం.317పై చేసిన ఉద్యమం తరహాలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతుంది.
                                                                                                                                                                                             - బండి సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌, కరీంనగర్​ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు