- ఉన్నతాధికారుల తీరుతో ఇబ్బందులు
- మరో రెండు రోజుల్లో త్రిసభ్య కమిటీ
- మంత్రి సురేఖను కలవనున్న ఎంప్లాయీస్
హైదరాబాద్, వెలుగు: అటవీ శాఖలో మెడికల్, స్పౌజ్ బదిలీల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మెడికల్, స్పౌజ్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో 100 మందికి పైగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అటవీ శాఖలో ఎంతో మంది ఉద్యోగులు జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయి వేర్వేరు జిల్లాలు, జోన్లలో పనిచేస్తున్నారు.
ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. జీవో 317 బాధితుల కోసం ముగ్గురు మంత్రులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భార్యాభర్తల విషయంలో జీవో 243, మెడికల్ కేసులకు జీవో 244, మ్యూచువల్ కేసులను పరిష్కరించడానికి జీవో 245ను నిరుడు నవంబర్ 29న విడుదల చేసింది. ఈ జీవోలతో వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించింది. వేకెన్సీ ఉంటే స్పౌజ్, మెడికల్ కేసులను పూర్తిగా పరిష్కరించాలని జీవోలో స్పష్టం చేసినా.. ఇంతవరకు ఉన్నతాధికారులు ఎటూ తేల్చడంలేదు.
నోటిఫికేషన్ ఇవ్వని పోస్టులను చూపుతూ
317 జీవో బాధితుల కోసం ఇచ్చిన ఆదేశాలను అటవీ శాఖలో పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఎఫ్డీవోలు, ఎఫ్ఆర్ఓ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖలో ఎఫ్ బీవో, ఎఫ్ఆర్ఓ, ఏసీఎఫ్ పోస్టుల కోసం టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపినా.. వాటిని వేకెన్సీగా చూపించడం లేదని, దీంతో స్పౌజ్, మెడికల్ కేసులను నిరాకరిస్తూ అటవీ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని పలువురు అధికారులు ఆరోపిస్తున్నారు.
కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వని పోస్టులను వేకెన్సీగా చూపించకుండా ప్రతిపాదనలు పంపించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉద్యోగులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పౌజ్, మెడికల్ కేసులను మానవతా దృక్పథంతో చూడాలని కోరుతున్నారు.ఉన్నతాధికారుల తీరుతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా ప్రభుత్వానికీ చెడ్డపేరు వస్తున్నదని వాపోతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు త్రిసభ్య కమిటీ ప్రతినిధులను కలిసి తమ గోడు విన్నవిస్తామని పేర్కొంటున్నారు.