- త్రీమెంబర్ కమిటీకి తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు
- పీఆర్సీ రిపోర్టుతో సీఎం నిజస్వరూపం తేలిపోయింది
- కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలోకి కూడా పనికిరాదు
- హెచ్ఆర్ఏ తగ్గిస్తే ఊరుకోం
- సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
- రెండో రోజూ 8 సంఘాలతో చర్చించిన కమిటీ..
- నేడు, రేపు మరిన్ని సంఘాలతో చర్చలు
హైదరాబాద్, వెలుగు: ఫిట్‌మెంట్‌ను 43 శాతానికి పైనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని, తడాఖా చూపిస్తామని హెచ్చరించాయి. పీఆర్సీ రిపోర్టు చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాదన్నాయి. ఈ రిపోర్టుతో సీఎం నిజస్వరూపం తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని త్రీమెంబర్ కమిటీ రెండో రోజు గురువారం పీఆర్సీపై ఎనిమిది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో పీఆర్టీయూ టీఎస్ , పీఆర్టీయూటీ, టీఎస్ యూటీఎఫ్ , రెవెన్యూ సంఘం, డ్రైవర్ల సంఘం, ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం, ఎస్టీయూ, టీయూటీఎఫ్ నేతలు పాల్గొన్నారు. బుధవారం టీఎన్జీవో, టీజీవో, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ సంఘాలతో చర్చలు జరిగాయి. మరిన్ని యూనియన్లతో శుక్ర, శనివారం కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. గురువారం జరిగిన చర్చల్లో పీఆర్సీ రిపోర్ట్ పై తమ అభ్యంతరాలను, సలహాలను, సూచనలను యూనియన్ల నేతలు సీఎస్ సోమేశ్‌కుమార్ దృష్టికి తెచ్చారు. అనంతరం యూనియన్ల నేతలు మీడియాతో మాట్లాడారు. 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ కమిషన్ చేసిన సిఫార్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సిఫార్సులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. హెచ్ఆర్ఏను పెంచాల్సింది పోయి తగ్గించాలంటూ సిఫార్సు చేయడం ఏమిటని, తగ్గిస్తే సహించబోమన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంచి ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించాలని, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కమిటీని కోరినట్లు వివరించారు.
రెవెన్యూ ఉద్యోగులకు స్పెషల్ స్కేల్ ఇవ్వాలి
అన్ని శాఖల కంటే రెవెన్యూ ఉద్యోగులం ఎక్కువగా పనిచేస్తున్నం. మాకు స్పెషల్ స్కేల్ ఇవ్వాలి. ధరణితో 24 గంటలు పనిచేస్తున్నం. పీఆర్సీ రిపోర్ట్ ఎంతో నిరాశపర్చింది. 65% ఫిట్ మెంట్ ఇవ్వాలని ఇది వరకే కోరినం. హెచ్ఆర్ఏ కూడా ప్రస్తుతం ఇస్తున్న దాని కంటే పెంచాలి. రెవెన్యూ అటెండర్లకు అలవెన్స్ ఇవ్వాలి.
– వంగ రవీందర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్
రిపోర్టులో మార్పులు చేసిన్రు
పీఆర్సీ రిపోర్టులో మార్పులు చేసిన్రు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా 7.5 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేయడం ఏమిటి? 2018 జులై ఒకటి నుంచి పీఆర్సీ అమలు చేయాలని కోరినం. మా శాలరీల పెంపు కోసం అప్పులను సాకుగా చూపడం సబబు కాదు. హెచ్ఆర్ఏను కుదించొద్దు. పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్మెంట్ లేదు.. ఈహెచ్ఎస్ కోసం బేసిక్ పే లో ఒక శాతం వసూలు చేయడం సరికాదు.
– సదానంద గౌడ్, ఎస్టీయూ అధ్యక్షుడు
రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచాలి
పీఆర్సీ రిపోర్ట్ అసంబద్ధంగా , అశాస్త్రీయంగా ఉంది. రిపోర్ట్ చూసి ఉద్యోగులు, టీచర్లు ఆందోళన చెందుతున్నరు. వారు సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతది. ఉద్యోగులు, టీచర్ల మీద కఠినంగా ఉండటం సరికాదు. 2018 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా మంచి ఫిట్ మెంట్‌ను ప్రకటించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచాలని కమిటీని కోరినం.
– రఘోత్తం రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ
సీఎం నిజస్వరూపం తేలిపోయింది
కనీసం చెత్త బుట్టలో వేసేందుకు కూడా పీఆర్సీ రిపోర్ట్ పనిచేయదు. ఈ రిపోర్టుతో సీఎం నిజస్వరూపం తేలిపోయింది. 43 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలి. తెగిస్తే పోరాడుతం. ఉద్యోగ, ఉపాధ్యాయుల తడాఖా చూపిస్తం. తెలంగాణను సాధించుకున్నట్లే ఫిట్మెంట్ సాధించుకుంటం.
– మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య, పీఆర్టీయూటీ అధ్యక్ష, కార్యదర్శులు
ఒప్పుకునేది లేదు..
పీఆర్సీ కమిషన్ చేసిన 7.5 శాతం ఫిట్ మెంట్ సిఫార్సును అంగీకరించబోం. 45 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని త్రీమెంబర్ కమిటీని కోరినం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కు విన్నవించాలని చెప్పినం . రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నం . సీపీఎస్ విధానంపై పీఆర్సీ కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేయలేదు. సీపీఎస్ విధానం తొలగించాలని త్రీమెంబర్ కమిటీని కోరినం.
– శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు పీఆర్టీయూటీఎస్ ప్రెసిడెంట్, జీఎస్
రూరల్ ఏరియాల్లోని టీచర్లకు స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలి
ఏపీలో 27 శాతం ఐఆర్ ఇస్తున్నరు. ఇక్కడ 7.5 శాతం ఫిట్మెంట్అంటే ఎట్ల? గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించాలని సీఎంను కోరుతున్నం. పీఆర్సీ రిపోర్టు ఎవరికీ పనికిరాని చెత్తగా మారింది. ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ పెంపు జనవరి నుంచే అమలు చేయాలి. రూరల్ ఏరియాల్లో పనిచేసే టీచర్లకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలి. ధరలన్నీ బాగా పెరిగాయి.. కనీస వేతనాన్ని పెంచాలి.
– మల్లారెడ్డి, టీయూటీఎఫ్ అధ్యక్షుడు
కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ పే పెంచాలి
45 శాతం ఫిట్ మెంట్ ఇస్తేనే అంగీకరిస్తమని త్రీమెంబర్ కమిటీకి చెప్పినం. కాంట్రాక్టు, ఔట్ సోర్స్ ఉద్యోగులకు కూడా బేసిక్ పే పెంచాలని కోరినం. ఫిట్ మెంట్ పై కమిటీ మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అశాస్త్రీయంగా ఉన్న ఫిట్ మెంట్ ను మేము ఆమోదించబోమని తేల్చిచెప్పినం. పీఆర్సీ కమిషన్ మంచి రిపోర్ట్ ఇచ్చిందని త్రీమెంబర్ కమిటీ సమర్థించింది. ఆర్థిక భారం లేకుండా ఉన్న డిమాండ్లు చెప్పాలని మమ్మల్ని అడిగిన్రు. ఈ నెలలో 650 మంది రిటైర్ కాబోతున్నరు. పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చినందున వారికి రిటైర్మెంట్ ఏజ్ పెంపు వర్తింపచేయాలి. హెచ్ఆర్ఏ పెంచకుండా తగ్గించటం సరికాదు.
– చావ రవి, జంగయ్య, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
ఇంత అన్యాయం ఏంది?
పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసిన 7.5 శాతం ఫిట్ మెంట్ బాధాకరం. ఉద్యమాలు చేసిన మాకు ఇంత అన్యాయం చేయటం తగదు. ఏడాదికో ఇంక్రిమెంట్ ఇవ్వటంతోపాటు హెచ్ఆర్ ఏ పెంచాలని త్రీమెంబర్ కమిటీని కోరినం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలి. ఈ నెలలోనే సుమారు 300 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నరు. అందరికీ రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
– శ్రీనివాస్ , డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు
For More News..