ఖమ్మం టీఎన్జీవోలో లొల్లి

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా టీఎన్జీవో ఆఫీస్ ను దక్కించుకునేందుకు ఆ యూనియన్ లోని రెండు వర్గాలు ప్రయత్నించడం సోమవారం ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలకు చెందిన నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు. టీఎన్జీవో భవనంలో యూనియన్ గత కార్యవర్గ సభ్యులు గుంటుపల్లి శ్రీనివాసరావు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ తో పాటుగా తాలూకా, యూనిట్ శాఖల లీడర్లు, ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు.

ఇది తమ యూనియన్ కు సంబంధించిన కార్యాలయం అని, ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి వీలులేదన్నారు. ఇరువర్గాల లీడర్లు మధ్య తీవ్ర వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మధ్యవర్తిగా స్థానిక కార్పొరేటర్ భర్త, కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర జోక్యం చేసుకుని రాష్ట్ర కమిటీ కార్యదర్శి మారం జగదీష్ తో ఫోన్ లో మాట్లాడారు. జగదీష్ ఇరువర్గాలను హైదరాబాద్ కు రమ్మని పిలిచారు. చర్చలు పూర్తయ్యే వరకు ఆఫీస్ కు తాళం వేయాలని చెప్పారు.