భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ధనిక రాష్ట్రమంటూ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్గవర్నమెంట్ తమ హయాంలో ఉద్యోగులకు ఒకటో తారీఖీన జీతాలియ్యలేని దుస్థితిలో కొట్టుమిట్టాడిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. చుంచుపల్లి మండలంలోని పీఆర్టీయూ ఆఫీస్లో శుక్రవారం ఎమ్మెల్యేను టీచర్లు సన్మానించారు.
ఈ సందర్భంగా పీఆర్టీయూ నేతలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. నిలిచిపోయిన ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ తిరిగి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కృషి చేయాలన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గొప్పలకు పోయిన గత బీఆర్ఎస్గవర్నమెంట్రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. ప్రోగ్రామ్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, బానోత్రవి, యూనియన్నేతలు, టీచర్లు పాల్గొన్నారు.