ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

  • డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగుల జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్యోగుల జేఏసీ నేతలు కోరారు. బుధవారం సెక్రటేరియెట్ లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, మెంబర్ దేవరకొండ సైదులుతో కలిసి పలువురు నేతలు డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలు, పీఆర్సీ, హెల్త్ కార్డులు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, 317 జీవో బాధితులకు న్యాయం, సీపీఎస్ రద్దు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్, ఏపీలో పనిచే స్తున్న క్లాస్ 4 ఉద్యోగులను తీసుకు రావడం తదితర మొత్తం 39 సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని నేతలు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉద్యోగుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారని వారు తెలిపారు. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.