నల్గొండ, యాదాద్రి జిల్లాల ఉద్యోగులకు ఫస్ట్​కే జీతాలొచ్చినయ్​

  • మునుగోడులోని 7 మండలాల వాళ్లకు పెండింగ్​ బిల్స్​ కూడా విడుదల
  • పక్కనే ఉన్న సూర్యాపేట సహా ఇతర జిల్లాలకు మాత్రం ఏదీ లేదు
  • మూడునాలుగేండ్లుగా ప్రతినెలా లేటుగా జీతాలిస్తున్న ప్రభుత్వం
  • ఉప ఎన్నికతో రెండు జిల్లాల వాళ్లకు మాత్రం ఈసారి టైమ్​కు పడ్డయ్​
  • రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు మూడో డీఏ విడుదలకు ఓకే

యాదాద్రి/హైదరాబాద్, వెలుగు: నల్గొండ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఒకటో తేదీనే జీతాలు వేసింది. మూడు నాలుగేండ్లుగా ఎప్పుడూ ఫస్ట్ తేదీన జీతాలు పడలేదని, పంద్రా తారీఖు తర్వాతే పడేవని, ఈసారి మునుగోడు ఉప ఎన్నిక వల్ల టైమ్​కు వచ్చాయని ఉద్యోగులు అంటున్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గం ఈ రెండు జిల్లాల పరిధిలో ఉంటుంది. ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి గట్టెక్కేందుకు, బై పోల్​లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని ఎంప్లాయీస్​లో చర్చ జరుగుతున్నది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల ఉద్యోగులకు జీతాలతోపాటు పెండింగ్​ బిల్స్​ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 
2018 ముందస్తు ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ ఫస్ట్​ తారీఖున జీతాలు రావట్లేదు. జిల్లాల పేర్లలోని మొదటి అక్షరం ప్రకారం విడతలవారీగా 20 తారీఖు వరకు ప్రభుత్వం ఆలస్యంగా జీతాలు వేస్తూ వస్తున్నది. దీంతో ‘వై’ అక్షరం ఉన్న యాదాద్రి జిల్లాకు పది నుంచి 17వ తారీఖు మధ్య జీతాలు పడేవి. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు మొదటిసారి ఫస్ట్​ తారీఖున యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లోని 11 వేల మంది ఎంప్లాయ్స్​కు జీతాలు పడ్డాయి. జీతాలు పడ్డట్టుగా మెసేజ్ ​రావడంతో ఎంప్లాయ్స్​ ఆశ్చర్యపోయారు. 

పక్కనే ఉన్న సూర్యాపేటకు వెయ్యలే

ఎన్నడూ లేని విధంగా తమకు ఫస్ట్​ తారీఖునే  జీతాలు పడడంతో  నల్గొండ, యాదాద్రి–భువనగిరి జిల్లాలోని ఉద్యోగులు పక్క జిలాల్లోని తోటి ఎంప్లాయ్స్​కు ఫోన్లు చేసి ఆరా తీశారు. పక్కనే ఉన్న సూర్యాపేట సహా ఇతర జిల్లాల్లో జీతాలు పడలేదని తెలియడంతో.. ఇదంతా ఎన్నికల లబ్ది కోసం టీఆర్​ఎస్​ సర్కార్​ చేసి ట్రిక్కు అని అంచనాకు వచ్చారు. ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉండగా..  యాదాద్రి జిల్లాలో రెండు, నల్గొండ జిల్లాలో ఐదు  మండలాలు ఉన్నాయి. ఈ కారణంగా రెండు జిల్లాల్లోని 11 వేల మంది గవర్నమెంట్​ ఎంప్లాయ్స్​ అకౌంట్స్​లో ఫస్ట్​ తారీఖునే జీతాలు పడ్డాయి. ఉమ్మడి నల్గొండలోని మరో జిల్లా సూర్యాపేటలో ఒక్క మండలం కూడా మునుగోడు నియోజకవర్గంలో లేకపోవడంతో ఆ జిల్లాలోని 7,290 మంది ఉద్యోగులకు జీతాలు రాలేదనే ఎంప్లాయీస్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సర్కారు తీరుపై సూర్యాపేట సహా ఇతర జిల్లాల ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకటో తారీఖున రావాల్సిన జీతాలను ప్రతిసారి ఆలస్యం చేస్తున్నారని, ఇప్పుడు ఉప ఎన్నిక ఉందనే రెండు జిల్లాల్లో టైమ్​కు ఇచ్చిందని అంటున్నారు. రాష్ట్రమంతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫస్ట్​ తారీఖునే జీతాలు విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ఆ ఏడు మండలాల్లో పెండింగ్​ బిల్స్​ కూడా..!

మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల గవర్నమెంట్​ ఎంప్లాయీస్​కు పెండింగ్​ బిల్స్​ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. డీఏ, ఏరియర్స్, మెడికల్​, సరెండర్​ లీవ్​లు, జీపీఎఫ్​ వంటి పెండింగ్​ బిల్స్​ వచ్చాయి. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో మొత్తం 49 మండలాలు ఉండగా.. వాటిలోని ఏడు మండలాల (మునుగోడు పరిధిలోని) ఎంప్లాయ్స్​కు మాత్రమే పెండింగ్​ బిల్స్​ రాగా.. మిగిలిన 42 మండలాల వాళ్లకు రాలేదు.

ఆర్టీసీ కార్మికులకు పెండింగ్​ డీఏ విడుదల

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు 3.9 శాతం డీఏను శాంక్షన్ చేస్తూ మేనేజ్ మెంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ నెల వేతనంతో ఈ డీఏ కార్మికుల ఖాతాల్లోకి జమ అవుతుందని పేర్కొంది. ఈ నెల 21న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్  మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మూడు డీఏలు ఇస్తామన్నారు. అయితే అదే రోజు సాయంత్రం అధికారులు మాత్రం 2 డీఏలకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు బైపోల్​లో  తమ నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మునుగోడు బైపోల్​లో సుమారు 6,500 మంది ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు ఉంది. ఇలాంటి పరిణామాలతో స్పందించిన ఆర్టీసీ.. మూడో డీఏకు కూడా ఓకే చెప్పింది.