
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి 386 దరఖాస్తులు స్వీకరించారు. వారంలోగా దరఖాస్తులను పరిశీలించి పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తర్వాత జిల్లా అధికారులతో మాట్లాడుతూ సర్కారు ఉద్యోగులు ఇన్టైంకు ఆఫీసుసకు రావాలన్నారు. తాను ఆకస్మిక తనిఖీ చేస్తానని, పని వేళల్లో లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎండల తీవ్రత, జాగ్రత్త చర్యలపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో జరిగిన సమావేశంలో అనుదీప్ పాల్గొన్నారు.
ప్రతి హెల్త్ సెంటర్, అంగన్వాడీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు, ఆర్బీఐ నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.