ఉద్యోగులకు ఇకనైనా భరోసా ఇవ్వాలి

ఉద్యోగులకు ఇకనైనా భరోసా ఇవ్వాలి

ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు, లబ్ధిదారుల వద్దకు తీసుకొని వెళ్లాల్సిన యంత్రాంగంలో వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఉంటున్నారు. వీరితో పాటుగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉంటారు.  బాలబాలికలను భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు, అధ్యాపకులు. వివిధ వర్గాల ఉద్యోగ , ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. అధికారంలోనికి వచ్చిన తరువాత తమ సమస్యలను పట్టించుకోవడంలేదని అసంతృప్తి తో ఉన్నారు . ఒకటో తారీకునే జీతాలు, పెన్షన్లు చెల్లించడం పట్ల మాత్రం ఉద్యోగుల్లో సంతృప్తి ఉంది.

డీఏ బకాయిలు

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని ఆరు నెలలకు ఒకసారి సవరించి చెల్లించడం గత నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది. అయితే విచిత్రంగా గత మూడు సంవత్సరాలుగా ఐదు విడతల డిఏ బకాయిలు పెండింగులో పడ్డాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక మరో రెండు డిఏలతో  అయిదుకు చేరాయి. రాష్ట్రంలోని 10 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తుందని వేచి చూసి, ఆందోళనలకు పిలుపునిస్తే ప్రస్తుతం ఇప్పటికైతే  ఒక్క డి ఏను మాత్రమే విడుదలచేసింది.  కొత్త పీఆర్సీ ని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 10 నెలలు గడిచినా పురోగతి లేదు.

ఇహెచ్‌ఎస్​ కోసం ఎదురుచూస్తున్నారు

 ఉద్యోగులకు నగదు రహితంగా వైద్య చికిత్స జరిపే పథకాన్ని ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’( ఇహెచ్ఎస్) అంటారు. అన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగుల ఆరోగ్య కార్డు అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని సుమారు రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు కోరుతున్నారు. కానీ గత పదేళ్లుగా ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల ఆరోగ్య కార్డును పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో అన్ని రకాల జబ్బులకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో నగదురహిత వైద్యాన్ని అందించే విధంగా ఉద్యోగులు ఆరోగ్య కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్నారు.  ప్రభుత్వం చొరవచూపాలి. 

పాత పెన్షన్​ విధానం తేవాలి

2024 మార్చి తర్వాత ఉద్యోగుల పదవీ విరమణ ప్రారంభమైంది. వారి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు గత ఆరు నెలలుగా పెండింగ్​లో ఉన్నాయి.  వారికి పెన్షన్ మాత్రమే చెల్లించి మిగతా ప్రయోజనాలను  పెండింగ్​లో  ఉంచడం రిటైరైన ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతోంది. ఇటీవల హైకోర్టు జోక్యం చేసుకొని పదవీ విరమణ ప్రయోజనాలను ఆరు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది.  ప్రభుత్వ ఉద్యోగులకు 2004 నుంచి అమలవుతున్న  సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న వాగ్దానంపై ప్రభుత్వం స్పందించాలి.   

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలి

రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో దాదాపు 1400 మంది వరకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిలీ, పంజాబ్, మణిపూర్, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని ఆంధ్ర యూనివర్సిటీలోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్లను  క్రమబద్ధీకరించారు. కానీ, మన రాష్ట్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయడంలేదు. పదేళ్లు, అంత కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే వారిని రెగ్యులర్ చేయాలని సుప్రీం కోర్టు 2006లో కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో తీర్పు నిచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి, రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తామన్న హామీపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. 

ఆందోళనలను పట్టించుకోవాలి

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌‌‌ చేయాలనీ, పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి మినిమం టైంస్కేల్‌‌‌‌ (ఎంటీఎస్‌‌‌‌) ఇవ్వాలనీ  కోరుతూ డిసెంబర్ 10 నుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు. సమ్మె నేపథ్యంలో విద్యా శాఖలో పాలన స్తంభించింది. వైద్య ఆరోగ్యశాఖలో పబ్లిక్ హెల్త్, నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమాల అమలులో క్రియాశీలకంగా పనిచేసే ఆశా వర్కర్ల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవాలి. 

హామీలపై దృష్టిపెట్టాలి

తమ సంక్షేమం, జీతభత్యాల గురించి పట్టించుకోవడంలేదని, యూనిఫారం అలవెన్సులు, పదవీ విరమణ తర్వాత ఆర్థిక వెసులుబాటు కల్పించాలని హోంగార్డులు కోరుతున్నారు.  అసంఘటిత రంగంలోని భవననిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాబ్ డ్రైవర్లు, స్విగ్గీ,జొమాటో (గిగ్ మరియు ప్లాట్ ఫామ్) కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. వివిధ వర్గాల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీల అమలు ఆలస్యానికి కారణంగా.. ప్రభుత్వ ఆర్ఠిక పరిస్థితిని ఉద్యోగులు, కార్మికులు అర్థం చేసుకుంటున్నారు. కానీ ఏడాది కాలం గడిచిపోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చిన హామీలపై తక్షణం దృష్టిపెట్టాలి.

జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి

జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఉద్యోగుల రి అలొకేషన్ పేరుతో అశాస్త్రీయంగా జీవో 317 ను రూపొందించి, హడావుడిగా చేసిన బదిలీలను పునః సమీక్షించి, ఉద్యోగ,  ఉపాధ్యాయులను ఆదుకుంటామని ప్రభుత్వం సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ నివేదిక తర్వాత మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ లో దరఖాస్తు చేసుకొమ్మని ఉత్తర్వులు ఇచ్చారు. కాని జీవో 317 అమలు చేయడం వలన స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, వారు కోరుకున్న జిల్లాకు బదిలీ చేయాలనే డిమాండ్​ను త్వరగా పరిష్కరించాలి.

కె. వేణుగోపాల్ (పూర్వ అధ్యక్షుడు, ఏపిటిఎఫ్)