ఉద్యోగులు, టీచర్లు.. హక్కులు కోల్పోతున్నరు

ఉద్యమ మూలాలను మరచి టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తమ హక్కులు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్నాయి. నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియని దీనావస్థలో ఉద్యోగులు ఉన్నారు. మూడేండ్లు ఆలస్యంగా పీఆర్సీ రావటమే మహద్భాగ్యంగా భావించే నిస్సహాయ స్థితిలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి సర్కార్ కు అనుకూలంగా ఉండటమే మేలని కొందరు, ప్రభుత్వం మెడలు వంచే పోరాటాలు మేలని మరికొందరు వెరసి ఉద్యోగులు, టీచర్లు వేర్వేరు దారుల్లో పయనిస్తున్నాయి. సర్కార్ నిర్ణయాలకు తలూపే వారికి ప్రగతి భవన్ అన్ని వేళల్లో స్వాగతం పలుకుతోంది. అదే వాస్తవ సమస్యలపై వామపక్ష భావజాల ఉద్యోగ, ఉపాధ్యాయ శ్రేణులు చేసే ఉద్యమాలపై సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. బహిరంగ అరెస్ట్ లు, హౌస్​ అరెస్ట్ లతో భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమించకుంటే కొత్త హక్కుల సంగతేమో గానీ ఉన్న హక్కులను కోల్పోనున్న నేపథ్యంలో నిర్బంధాలకు, ఒత్తిళ్లకు తలవంచని మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

ఎంప్లాయీస్​ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులు, టీచర్ల సమస్యలు పరిష్కరించక పోగా, వివాదాస్పద నిర్ణయాలతో కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. ఏండ్ల తరబడి చేసిన అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, ఉద్యమ ప్రయోజనాలు.. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కోల్పోవటంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. లక్షల ఉద్యోగాల లెక్కలు గల్లంతు అవుతున్నాయి. వేల సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉద్యోగులపై భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. ఇక మహిళా ఉద్యోగులపై మంత్రులే అసభ్య పదాలతో విరుచుకుపడుతున్న తీరు మన కళ్ల ముందే కనిపిస్తోంది. 

ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు లేవు
ఉద్యోగాలకు సంబంధించి వేలాది ఖాళీలు ఉన్నా రిక్రూట్​ మెంట్​లు చేయడం లేదు. మూడేండ్లుగా ట్రాన్స్​ఫర్లు, ఏడేండ్లుగా ప్రమోషన్లు లేవు. పన్నెండేళ్లుగా అంతర్ జిల్లా బదిలీలు లేవు. ఇన్​చార్జ్​ల పాలనలో బడులు గాడి తప్పాయి. కోరి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఏటేటా వార్షిక బడ్జెట్ లో విద్యా రంగానికి నిధుల కేటాయింపు తగ్గిపోతోంది. దీంతో పాఠశాల విద్య కునారిల్లిపోయింది. దాదాపు మూడేండ్ల ఆలస్యంతో ప్రకటించిన పీఆర్సీ ఆమలు వాస్తవ ప్రయోజనాలను కాలరాసింది. ఏడాది బకాయిలను పదవీ విరమణ లేదా అకస్మిక మరణం తర్వాత చెల్లిస్తామని చెప్పడం దారుణం. సీపీఎస్​ ను రద్దు చేయకుండా.. చెల్లించిన నెలవారి చందాలను వదులుకుంటే ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తామనటం సర్కారు పట్టపగలు దోపిడీ చేయటమే. కొత్త పీఆర్సీలో ఇంటి అద్దె అలవెన్సులు పెంచటానికి బదులు తగ్గించటం విచిత్రంగా ఉంది. 2018 మేలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఉపాధ్యాయ లోకం సమక్షంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఉత్తర్వులే నేటికీ అమలు కావటం లేదు. గత ఆరేండ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు. విద్యా శాఖలో జీవో 124 అమలుపై స్టే ఎత్తివేసి, కొత్త జిల్లాలు, జోన్, మల్టీ జోన్లకు పోస్టుల కేటాయింపులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. 

హక్కులను కాలరాస్తున్న సర్కారు
ప్రభుత్వ విద్య, సంక్షేమం సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన ప్రభుత్వమే ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తోంది. ఉన్న హక్కులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో కింది స్థాయి శ్రేణుల్లో అసహనం కలగటం సహజమే. ఉపాధ్యాయ ప్రతినిధులతో చర్చలకు సర్కార్ ముందుకు రావటం లేదు. ఏడేండ్లుగా విద్యారంగ ప్రగతిపై ఎలాంటి సమీక్షా నిర్వహించలేదు. అనుకూలంగా ఉండే కొద్ది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులకే అపాయింట్ మెంట్ ఇచ్చి తమ విధాన ప్రకటనలను వారితో చెప్పిస్తున్నారు. పోరాటాలే సమస్యల సాధనకు అంతిమ మార్గమనే దృష్టికోణం నుంచి మళ్లించి ప్రాతినిథ్యాలకే పరిమితం అవుతూ పోరాటాలను అటకెక్కించటం ఉద్యమాలను నీరు కార్చటమే. ఉద్యమస్ఫూర్తికి భిన్నంగా లాబీయింగ్  పద్ధతులను అవలంబిస్తున్నందునే కిందిస్థాయి ఉద్యోగ శ్రేణులకు ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలపై నెగెటివ్ అభిప్రాయం కలుగుతున్నది.

అరెస్టులతో భయపెడుతున్నది
హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయడంపై గత ఆరేండ్లుగా నిర్లక్ష్యం వహించామనే భావన ఉద్యోగ వర్గాల్లో బలంగా ఉంది. వాస్తవంగా లాబీయింగ్ విధానాలను ఖండిస్తూ చైతన్యశీలంగా పోరాడుతున్న ఉద్యమ కార్యాచరణలపై అరెస్టులు, హౌస్​ అరెస్టులు అమలు చేస్తూ సర్కార్  అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది. కనీసం ధర్నాలు, ర్యాలీలు చేసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. విద్య ప్రాథమిక హక్కు అనే విషయాన్ని మరిచిపోయి.. ప్రభుత్వ విద్యను క్రమంగా హీనదశకు తెస్తున్నది. కరోనా థర్డ్​ వేవ్ బూచి చూపి మరో విద్యా సంవత్సరం ప్రత్యక్ష తరగతులకు బడిని దూరం చేసింది. మొదట బడుల హేతుబద్ధీకరణ అన్నది. ఇప్పుడు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అంటున్నది. సర్కార్ విద్యను మాయం చేసే కుట్రలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై పోరాటం చేయటమే లక్ష్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం ముందుకు రావాలి.

ధనిక రాష్ట్రంలో ఒకటో తేదీన జీతాలు వస్తలేదు
రాష్ట్రంలో మొత్తం ఖాళీలు1,91,126 అని రిటైర్డ్​ ఐఏఎస్ లతో కూడిన పీఆర్సీ కమిటీ తమ నివేదికలో తెలిపితే.. నేడు ఖాళీల సంఖ్యను సర్కారు 56,979కి పరిమితం చేసింది. ఇప్పుడు ఉన్నపళంగా చేసిన 50 వేల ఉద్యోగాల ప్రకటన వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయో తెలియనిది కాదు. ధనిక రాష్ట్రమని ఒక నాలికతో చెప్తూ, మరో నాలికతో జీతాలను నెల ఒకటవ తేదీన ఇవ్వలేమని నిస్సిగ్గుగా చెపుతున్నది. సీమాంధ్ర ప్రభుత్వాలు కూడా ఏనాడూ వేతనాలు ఇంత ఆలస్యంగా చెల్లించలేదు. కానీ, నేడు ప్రతి రోజు ఫ్రీజింగ్ పెడుతూ చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్నారు. వేల కోట్లు అప్పులు చేస్తూ పీఆర్సీ బకాయిలపై కప్పదాటు వేస్తూ రిటైర్మెంట్​ తర్వాత చెల్లిస్తామంటున్నది. పెన్షనర్లకు వాయిదాల మీద చెల్లించనుంది. పీఆర్సీ బిల్లులు చేసుకోవటానికి కొన్ని శాఖలకు రావాల్సిన ఏహెచ్ఆర్ఏ, సీసీఏ ఉత్తర్వుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

నెలల తరబడి ఆలస్యం
పీఎఫ్, గ్రూప్ ఇన్స్యూరెన్స్, నేషనల్​ పెన్షన్ స్కీమ్, లోకల్ బాడీ ఫండ్స్, పీడీ అకౌంట్స్ మొదలైన వాటిలో ఉండే నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి కాదు. కానీ వీటిని ఉద్యోగికి అందచేయటంలో జరిగే ఆలస్యం అంతా ఇంతా కాదు. రిటైర్ అయిన ఉద్యోగికి రావల్సిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ఐదారు నెలలు ఆలస్యంగా జరుగుతోంది. సరెండర్ లీవులు, పీఎఫ్, గ్రూప్ ఇన్స్యూరెన్స్, లోన్లు, మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్లు నెలల తరబడి క్రెడిట్ కావటం లేదు. నాన్ గెజిటెడ్ అందరూ తీసుకునే పండుగ అడ్వాన్సులు, దీర్ఘకాలిక లోన్లు, ఎల్టీసీ వంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయం పుస్తకాల్లో తప్ప వాస్తవంలో ఉద్యోగులు మర్చిపోయారు. ఆఫీస్ అవసరాల కోసం ఖర్చు చేసిన టీఏ, కాంటింజెంట్ బిల్లుల్లో సగం కూడా రావటం లేదు.ఆ వచ్చే సగం కూడా ఆరు నెలలకో, ఏడాదికో వస్తోంది. 

ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలె
ఉద్యమ స్ఫూర్తితో పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాల్సిన నాయకత్వం స్వప్రయోజనాల కాంక్షతో లాబీయింగ్ వ్యవహారాలకు దిగటంతో ఉద్యోగులు, టీచర్ల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. కానీ, ఉద్యోగ సంఘాల నాయకులకు ఆ స్పృహలేకపోవటం విచారకరం. లాబీయింగ్ వల్ల ప్రయోజనాలే ఉంటే వందల సంఖ్యలో ఉన్న సమస్యలు అవలీలగా పరిష్కారం కావాలి. లాబీయింగ్  ద్వారా వ్యక్తిగత ప్రయోజనాలు పొందవచ్చేమో కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావనేది నిజం. సర్కార్ చెప్పే మాయమాటలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరచాల్సిన అవసరాన్ని ఇకనైనా గుర్తించాలి. లాబీయింగ్ లతో ఉద్యమ లక్ష్యాలు సాధించలేమని గుర్తించి ఐక్య ఉద్యమాలతో చేయిచేయి కలిపి కొత్త దిశగా పోరాటం చేయాలి. అప్పుడే ఉద్యోగులు, టీచర్ల సమస్యలపై రాష్ట్ర సర్కారు దిగివస్తుంది.

- మైసా శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్