- పాత పింఛన్ విధానమే అమలు చేయాలి: టీజీఈజాక్
హైదరాబాద్, వెలుగు: సీపీఎస్, యూపీఎస్ విధానం వద్దని, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పింఛన్ విద్రోహ దినం పాటించారు. ఈ సందర్భంగా గన్ పార్కు వద్ద భారీ వర్షంలోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్(టీఎన్జీఓ), సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు(టీజీఓ) మాట్లాడారు.
పాత పింఛన్ విధానంలో ఉద్యోగి తన చివరి వేతనంలో 50% మొత్తాన్ని పింఛన్ రూపంలో అందుకునేవారని, దీన్ని తర్వాత డీఏ, పీఆర్సీకి అనుగుణంగా మార్పులు చేసే వారని గుర్తుచేశారు. 2004 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానంలో పింఛన్ తక్కువగా వచ్చిందన్నారు. దీంతో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తే.. యూపీఎస్ విధానం తీసుకొచ్చారన్నారు.
ఇదికూడా ఉద్యోగులకు పూర్తిస్థాయి సామాజిక భద్రత కల్పించేలా లేదన్నారు. యూపీఎస్ విధానాన్ని వెనక్కి తీసుకొవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు స్థితప్రజ్ఞ, పింగిలి శ్రీపాల్ రెడ్డి, సదానందంగౌడ్, కటకం రమేష్, చావ రవి, రవీందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ , మధుసూధన్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణయాదవ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.