కోట్లమందికి ఈరోజు కాస్తో కూస్తో ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకంతో పాటు, 80 కోట్ల మంది పేదలకు బతకడానికి ఉపయోగకరంగా ఉన్న ఉచిత రేషన్ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. యూపీఏ సర్కారు పాలనలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ఉన్నకాలంలో రూపొందించినవే ఈ పథకాలు! ఈరోజు ఈ పథకాల పేరు చెప్పుకుని లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడుగుతోంది.
ఉచిత రేషన్ పథకంను 2013లో పార్లమెంటులో చట్టం చేశారు. ఇప్పుడు దానిని ప్రధాని నరేంద్ర మోదీ తన గ్యారంటీగా చెప్పుకోవడం విడ్డూరం! 2013లో నేషనల్ ఫుడ్‌సెక్యూరిటీ చట్టం చేశారు. దీనిని కరోనా సమయంలో పేరు మార్చి అమలు చేస్తున్నారు. నిజానికి మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ఈ ఉచిత రేషన్ పథకంను తెచ్చినపుడు, గుజరాత్లో మోదీ సీఎంగా ఉన్నారు. ఆయన ఉచిత రేషన్ వద్దు అంటూ కేంద్రానికి లేఖ కూడా రాసిన దాఖలాలు ఉన్నాయి.
50 శాతం పట్టణాల్లో, 77 శాతం గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ ఇస్తున్నారు. నార్త్ లో రెండు కేజీల గోధుమలు, రెండు కేజీల బియ్యం ఇస్తున్నారు. నిజానికి ఈ రోజు కూడా ప్రపంచంలోని పోషకాలు సరిగా లభించని 125 దేశాల్లో భారతదేశం 111వ స్థానంలో ఉన్నది. గత పది ఏండ్ల బీజేపీ, మోదీ పాలనలో 25 శాతం పేదరికం తగ్గింది అని చెప్పే పీఎం మోదీ 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ను ఇంకా ఇస్తూనే ఉన్నారనేది శోచనీయం. 2011–2012 నుంచి జనగణన లేదు.
ఒకవేళ జనగణన జరిగితే మరో 10 కోట్లమంది పేదల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఉచిత రేషన్ ను మరో ఐదు ఏండ్లు పెంచుతున్నామని పీఎం మోదీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు.
రేషన్‌కు ఓటుకు లింకు
ఉచిత రేషన్ మోదీ గ్యారంటీ అంటున్నారు. రేషను ను ఓటుకు లింకు పెట్టి, రేషన్ సంచి మీద మోదీ ఫొటో పెట్టుకున్నారు. నిజానికి ఈ పథకంలో రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉంటుంది, కానీ, సంచుల మీద పీఎం ఫొటోనే ఉంటుంది. రేషన్ అనేది పార్లమెంటులో చేసిన చట్టం ప్రకారం ఇస్తున్నది మాత్రమే. దాని పేరును ప్రధానమంత్రి అన్నయోజన అని మార్చుకున్నంత మాత్రాన అది పీఎం మోదీ గ్యారంటీ, ఆయన ఘనత ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? రేషన్ ఇస్తున్నారు కాబట్టి ఓటు వేయాలని లబ్ధిదారులతో ఎలా మాట్లాడిస్తారు.
పీఎం రేషన్ పేరు మీద ఓటు ఎలా అడుగుతారు? ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన ప్రచారంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదుకు బదులు, పేదలకు పది కేజీలకు పెంచి రేషన్ ఇస్తామని అంటున్నది. ఒక్కసారి ఈ ఉచిత రేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం మెజారిటీ లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందుల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయలేదు. పీఎం మోదీ చెబుతున్నట్లు హవాయ్ చెప్పల్ ఉడాన్ నహీ భర్ రహి హై! ( పీఎం మోదీ చెప్పినట్లు సాదా చెప్పుల జీవితాలు ఏమీ బాగుపడలేదు ) పైగా మరింత పేదరికంలోకి నెట్టబడ్డాయి.
రెండు, మూడు వేల కిరాయి ఇండ్లలో ఉంటూ, ఒకటి, రెండు బల్బుల వెలుగులో, నేలమీద దిండు కూడా సరిగా లేని, తాగునీరు సైతం సక్రమంగా లభించని, మురికి గల్లీలలో ఉంటూ, పెరిగిన ధరల వల్ల ఆర్థికంగా ఇబ్బందిపడుతూ కూలిపని కూడా సరిగా దొరకక పేదల జీవితాలు ఆగం అయిపోతున్నాయి.
పేదల జీవితాలు ఆగమాగం
కేవలం ఐదు కేజీల రేషన్పేద జీవితాలకు ఏమాత్రం సరిపోదు అనేది తెలియదా? 70 కోట్ల మంది వద్ద ఉండాల్సినంత సంపద 22 నుంచి 25 మంది కార్పొరేట్ల వద్ద ఉంటే అసమానతలు ఎలా దూరం అవుతాయి మోదీజీ?ఉచిత రేషన్ ఒక్కటే పేదోడి జీవితాన్ని బాగు చేయలేదు.
ప్రభుత్వం ఇచ్చే రేషన్ ను నెత్తి మీద మోసుకుని కిలోమీటర్ల దూరంలో లభించే తక్కువ కిరాయి ఇండ్లలో ఉండే ఆ పేద మహిళల అలసటను ఎన్నడు అయినా చూశారా? రేషన్ ఓట్లను రాల్చుతుందనే కక్కుర్తి రాజకీయం ఇంకెన్నాళ్లు నడుపుతారు. పేద, దారిద్ర్యరేఖ కింద ఉన్న జీవితాల బాగుకోసం, వారి కనీస ఆర్థిక పరిపుష్టి కోసం కాంగ్రెస్ ప్రకటించిన నెలకు 8,500 రూపాయలు పేద మహిళల ఖాతాలో వేయడం వల్ల, చదువుకున్నవారి పిల్లలకు అప్రెంటిస్ షిప్ ద్వారా ఉద్యోగం కల్పించే, ఏటా లక్ష రూపాయలు వారికి ఇచ్చే పథకం ఇండియా కూటమి అధికారంలోకి రావడం ద్వారా సాధ్యం అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ!
ఇలాగైనా 80 కోట్ల ఉచిత రేషన్ బతుకులు బాగుపడుతాయి అని ఆశిద్దాం! కష్టపడి పని చేసుకునేలా, కష్టానికి తగిన ఫలితం పొందేలా, పనిని కల్పించే బాధ్యతను ప్రభుత్వం కల్పించాలి! తద్వారా కొంత పొదుపు చేసుకుని, ఉచితాల వైపు చూడకుండా ప్రజలు ఉపాధి పొందే అవకాశం ఇవ్వాలి. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కుకు ప్రాధాన్యమివ్వాలి. అయితే ఇక్కడ ఒక్క విషయం స్పష్టం చేయాలి. పేదలకు ఉచిత రేషన్ అనేది చట్టసభలో చట్టం చేయడం ద్వారా అమలు అవుతున్నదే! అది పీఎం మోదీ గ్యారంటీ పథకం కాదు!
పైగా ఈ ఉచిత బియ్యం ప్రచార సంచుల మీద పీఎం ఫొటో, నినాదాలు, హోర్డింగుల ప్రచారం, టీవీలలో, పేపర్లలో యాడ్లు తదితర ప్రచారం కోసం కోట్లలో ఖర్చు పెడుతున్నారు! ఎవరి సొమ్మండి ఇదంతా? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఏమి చేయలేదని చెప్పుకునే పీఎం మోదీ, ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు కూడా తగ్గించిన దాఖలాలు ఉన్నాయి. మరోవైపు ఉచిత రేషన్ తన గ్యారంటీ అంటూ మోదీ ప్రచారం చేసుకోవడం కొసమెరుపు! --------------
- ఎండి మునీర్,
సీనియర్ జర్నలిస్ట్