
తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, కేరళ రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం నిధుల విడుదలలో తీవ్ర అలసత్వం, జాప్యం కనిపిస్తోంది. బెంగాల్ రాష్ట్రానికైతే గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ అంశంపై ఆయా రాష్ట్రాల ఎంపీలు లోక్‌సభలో నిరసనలు తెలిపినప్పటికీ కేంద్రం మాత్రం చలించట్లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదల కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ సంవత్సరం 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలాగ మారిన ఈ పథకం కోట్ల మందికి లబ్ధి చేకూర్చింది.
పేదల కోసం కనీసం వంద పని దినాల్ని హక్కుగా కల్పించిన ఘనత ఆనాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానిది. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, నీటి సంరక్షణ, అడవుల పెంపకం లాంటి పనుల ద్వారా ప్రజలకు కనీస వేతనం అందించేలా చర్యలు తీసుకుంది. గ్రామసభల్లోనే పనుల ఎంపిక, సామాజిక తనిఖీలు లాంటి పటిష్ఠమైన చర్యల్ని చట్టంలో పొందుపర్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఉపాధి హామీ చట్టం మొదటి దశాబ్ధంలోనే 32 శాతం వరకూ పేదరికాన్ని తగ్గించింది. 14 కోట్ల మంది పేదరికం బారిన పడకుండా ఈ పథకం కాపాడగలిగింది.
ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న 45 శాతం మంది మహిళలు అంతకు ముందు ఎక్కడా పని చేయలేదు. కేరళ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసుకు ఎంపికైన శ్రీధన్య సురేశ్ లాంటి వాళ్ల విజయం వెనుక ఉఫాధి హామీ పథకం ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో సుమారు 89 శాతం మంది గ్రామీణ మహిళలు ఉపాధి హామీ పథకంలో పాల్గొన్నారు. కొవిడ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతే... పట్టణాల నుంచి గ్రామాలకు తరలివెళ్లిన ప్రజలకు ఏకైక ఆధారంగా నిలిచింది గ్రామీణ ఉపాధి హామీ పథకం. 2020–-21 సంవత్సరంలో 389 కోట్ల మానవ పనిదినాల్ని కల్పించింది. 2021-–22 లో కూడా 363 కోట్ల మానవ పనిదినాలు అవసరమయ్యాయి.
తగ్గుతున్న నిధుల కేటాయింపు
ఏ పథకం విజయవంతం కావాలన్నా ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం ఉండాలి. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకానికి కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిధులు కేటాయించట్లేదు. 2021-–22 బడ్జెట్ లో రూ.98 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం... ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 25 శాతం నిధులు కోత విధించి రూ.73 వేల కోట్లకు తగ్గించింది. 2023-–24 సంవత్సరంలో 30 శాతం నిధుల్ని తగ్గించి రూ.61 వేల కోట్లకు పరిమితం చేసింది. ఇక 2024 –-25లో రూ.86 వేల కోట్లు కేటాయిస్తే ఆ ఏడాది ఫిబ్రవరి వరకే ఆ కోటా దాటి రూ.88 వేల కోట్లు ఖర్చయ్యాయి. ఈ ఏడాదిలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ లెక్కల ప్రకారం రూ.4 వేల కోట్లు వేతనాల రూపంలోనూ మరో రూ.5 వేల కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది.
కరోనా కాలంలో ఆదుకున్నది ఉపాధి హామీయే
మరోవైపు గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకం కింద పని చేసేవాళ్లకు కనీస వేతనాన్ని పెంచట్లేదు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.400లకు పెంచాలన్న డిమాండ్‌ను మోదీ
ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, కనీస పనిదినాల్ని వంద నుంచి 150కి పెంచాలని కార్మిక సంఘాలు కోరుతున్నా ఉద్దేశపూర్వకంగా నిర్ణయాన్ని ఆలస్యం చేస్తోంది. 2015లో ఈ పథకాన్ని విమర్శించిన నరేంద్ర మోదీకి.. ఈ పథకం గొప్పతనం అర్థం కావటానికి కొవిడ్ కారణమైంది.
జీడీపీలో ప్రస్తుతం ఈ పథకానికి 0.26 శాతం నిధులు కేటాయిస్తుండగా ప్రపంచ బ్యాంక్ మాత్రం కనీసం 1.7 శాతం నిధుల్ని కేటాయించాలని ప్రతిపాదించిన విషయాన్ని మోదీ సర్కారు పక్కనపెట్టింది. ఇప్పటికైనా నరేంద్రమోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదరణను గుర్తించి, ఆర్థిక సంవత్సరం మొదట్లోనే అవసరమైన నిధుల్ని కేటాయించాలి. ఉపాధి కూలీలకు ఆధార్ పేమెంట్లను ఐచ్ఛికం చేయాలి. రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
వివరాలు సరిగా లేవని జాబ్‌కార్డులకు ఎగనామం
క్రమ పద్ధతి ప్రకారం ఈ పథకాన్ని ప్రజలకు దూరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. సమయానికి వేతనాల్ని జమ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా వేతనాలు జమ అవ్వకపోతే రోజు వారీగా లెక్కేసి పరిహారాన్ని అందించాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ నంబర్ లింక్ లాంటి సాంకేతిక అంశాల్ని అడ్డుపెట్టుకొని పథకం ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. 2023 జనవరి 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించటంలో విఫలమైంది.
జాబ్ కార్డుకు, ఆధార్, బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానించటం, పేర్లు, పుట్టిన తేదీల్లోని వివరాలు సరిపోకపోవటం వల్ల 6.7 కోట్ల మంది ఉపాధి హామీ పథకానికి దూరమయ్యారు. చాలా మందికి తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవన్న కారణం కూడా తెలియదు. తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షల మంది ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్‌లో తమ పేరు నమోదు చేసుకోలేకపోయారు. గత పదేళ్లుగా 71 శాతం మందికి సరైన సమయంలో వేతనాల్ని అందించలేకపోయింది ఎన్డీఏ ప్రభుత్వం. బెంగాల్ లాంటి రాష్ట్రానికి ఏవో సాకులు చూపించి, అక్కడ అసలు మూడేళ్లుగా ఉపాధి హామీ పనులు నిల్చిపోవటం రాష్ట్రాల మీద మోదీ ప్రభుత్వ వివక్షగా భావించవచ్చు.
తోట లక్ష్మీకాంతరావు, జుక్కల్ ఎమ్మెల్యే