విలీన గ్రామాల్లో..ఉపాధి కష్టాలు 

  •     బల్దియాల్లో కలపడంతో 2వేల మందికి ఉపాధి హామీ పనులు దూరం 
  •     జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 9 గ్రామాలు విలీనం 
  •     రెండు మేజర్ జీపీలు మున్సిపల్‌‌‌‌గా అప్‌‌‌‌గ్రేడ్​
  •     ఆందోళనలో ఉపాధి కూలీలు 

జగిత్యాల, వెలుగు : విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు లేక కూలీలు అవస్థలు పడుతున్నారు. గతంలో గ్రామాలుగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు దొరికేవని, ప్రస్తుతం మున్సిపాలిటీల్లో కలవడంతో పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి కూలీలు వాపోతున్నారు. మున్సిపాలిటీల పరిధి పెరగడంతో 9 గ్రామాలు విలీనంగా కాగా, మేజర్​పంచాయతీలు రాయికల్‌‌‌‌, ధర్మపురి మున్సిపాలిటీలుగా అప్‌‌‌‌గ్రేడ్​అయ్యాయి. దీంతో సుమారు 2వేల మంది కూలీలు ఉపాధికి దూరమయ్యారు. కాగా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మున్సిపాలిటీల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేస్తుండగా, తెలంగాణలో కూడా పట్టణాల్లోని కూలీలకు వర్తింపజేయాలని కోరుతున్నారు. 

మున్సిపాలిటీలుగా రెండు జీపీలు 

జగిత్యాల జిల్లాలో ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మెట్‌‌‌‌పల్లి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటితోపాటు రాయికల్, ధర్మపురి మేజర్ జీపీలను మున్సిపాలిటీలుగా అప్‌‌‌‌గ్రేడ్​ చేశారు. వీటితోపాటు మున్సిపాలిటీలకు ఆనుకొని ఉన్న గ్రామాలను బల్దియాల్లో కలిపారు.  జగిత్యాల మున్సిపల్‌‌‌‌లో శివారు గ్రామాలైన శంకులపల్లి, గోవిందుపల్లి, టీఆర్ నగర్, హస్నాబాద్, తిమ్మాపూర్, తిప్పన్నపేట్‌‌‌‌ గ్రామాలు, కోరుట్ల మున్సిపాలిటీలో ఏకీన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, మెట్‌‌‌‌పల్లిలో వెంకట్రావుపేట, ఆరపేటను విలీనం చేశారు. దీంతో ఈ తొమ్మిది విలీన గ్రామాలతోపాటు రెండు కొత్త మున్సిపాలిటీల్లోని ఉపాధి కూలీలకు పనులు దొరకడం కష్టంగా మారింది.

గ్రామాల్లో వ్యవసాయ సీజన్‌‌‌‌లో కూలీలకు చేతినిండా పని ఉంటుంది. ఆ పనులు ముగిశాక గ్రామాల్లో ఎలాంటి పనులు దొరకవు. ముఖ్యంగా ఎండాకాలం పనుల్లేక కూలీలు ఇబ్బందులు పడుతుంటారు. గతంలో గ్రామాలుగా ఉన్నప్పుడు వీరందరికీ ఉపాధి హామీ పథకం కింద ఏదో ఓ పని కల్పించేవారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో కలిశాక పనుల్లేక అవస్థలు పడుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఉపాధి దొరకడం లేదు 

మాది తిప్పన్నపేట్ గ్రామం. గతంలో ఉపాధి హామీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. ఇటీవల మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసింది. అప్పటినుంచి ఉపాధి హామీ పని బంద్​కావడంతో పనులు దొరకడం లేదు. 

 -  నర్సయ్య, తిప్పన్న పేట్, జగిత్యాల

 పట్టణాల్లోనూ ఉపాధి హామీ పనులు అమలు చేయాలి 

పట్టణాల్లో విలీన గ్రామాల్లో పేద వర్గాలకు చెందిన ప్రజలను ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ప్రభుత్వం వీరి పక్షాన ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఉపాధి హామీ పనులు చేపట్టాలి. 

-  దేవవరం, కూలీ సంఘం నాయకులు