ఉపాధి పనులకు కూలీల వెనుకడుగు.. బతిమిలాడుకుంటున్న సిబ్బంది ​

  • ఉపాధి పనులకు కూలీల వెనుకడుగు
  • బయట కూలి రూ.600.. ఈజీఎస్​లో  రూ.150 మాత్రమే
  • ప్రతీ గ్రామంలో  200 మంది లేబర్​ టార్గెట్​ 
  • రాత్రిపూట గ్రామాల్లోకి  వెళ్లి కూలీలను బతిమిలాడుకుంటున్న సిబ్బంది ​
  • స్కీంపై నమ్మకంతోనే   గ్రామాల్లో  సిమెంట్​ రోడ్లు, జీపీ  బిల్డింగ్​ వర్క్స్​కు  సర్కార్​ పర్మిషన్​ 
  • పనులు జరగకపోతే ఎంప్లాయీస్​ శాలరీలు, అడ్మినిస్ట్రేటివ్​ ఖర్చులూ కష్టమే

నల్గొండ, వెలుగు :   జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు కూలీలను తీసుకొచ్చేందుకు ఉపాధి  సిబ్బంది  అష్టకష్టాలు  పడాల్సి వస్తోంది. ప్రతీ ఏడాది ఫిబ్రవరి నుంచే ఉపాధి పనులకు డిమాండ్​  ఏర్పడుతుంది.  కానీ ఈ ఏడాది మాత్రం పనులకు రాకుండా కూలీలు మొహం చాటేస్తున్నారు.  గతేడాదితో పోలిస్తే ఈ సీజన్​లో పనులకు ఆశించిన స్థాయిలో డిమాండ్​ ఉండట్లేదు.  ఉపాధి పనులపైనే నమ్మకం పెట్టుకున్న ప్రభుత్వం గ్రామాల్లో  సిమెంట్​ రోడ్లు, గ్రామ పంచాయతీ  బిల్డింగ్​ నిర్మాణాలకు శాంక్షన్​ ఇచ్చింది. కానీ పనులు జరుగుతున్న తీరు చూస్తే ప్రభుత్వం లక్ష్యం నెరవేరేలా కనిపించట్లేదు.  దీంతో గత్యంతరం లేక కలెక్టర్లను ఉపాధి పనులపైనే ఫోకస్​ పెట్టాలని ఒత్తిడి చేస్తోంది.  దీనిలో  భాగంగా అన్ని మండలాలకు జిల్లా ఆఫీసర్లను స్పెషల్​ ఆఫీసర్లుగా నియమించడంతోపాటు,  లేబర్​ టార్గెట్​ పెట్టింది.  ప్రతీరోజు గ్రామంలో  కనీసం రెండొందల మంది కూలీలను ఉపాధి పనులకు తరలించాలని ఆదేశించింది.  

కూలీలను పనులకు రప్పించకుంటే  రాబోయే రోజుల్లో ఉపాధి హామీ ఎంప్లాయిస్​కు, గ్రామీణాభివృద్ధి ఆఫీసర్లకు జీతాలు ఇవ్వలేమని,  పరిపాలన ఖర్చులు కూడా భరించడం కష్టమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో  కలెక్టర్లు, ఆఫీసర్లు కూలీలను తరలిచేందుకు మండలాల్లో అవగాహన సదస్సులు పెడుతున్నారు.  మరోవై పు ఉపాధి సిబ్బంది  రాత్రిపూట గ్రామాల్లోకి  వెళ్లి కూలీలకు కౌన్సిలింగ్​ ఇస్తున్నారు.  ఉపాధి పనులకు రావాలని, లేదంటే ‘‘మీతో పాటు మేం కూడా నష్టపోతాం”అని  బతిమిలాడుకుంటున్నారు.  ఉపాధి చట్టప్రకారం జరిగే పనుల్లో 60 శాతం కూలీలకు, 40 శాతం మెటీరియల్​ కాంపోనెంట్ కింద ఖర్చు పెడ్తారు.  లేబర్​  బడ్జెట్​ అనుకున్న ప్రకారం పనులు జరిగితే 40 శాతం మెటీరియల్​ నుంచి ప్రభుత్వం డెవలప్​మెంట్​ పనులు, ఎంప్లాయీస్​ శాలరీలు, స్టేషనరీ ఖర్చులు చెల్లిస్తుంది.  కానీ ఈ సీజన్​లో 40 శాతం మెటీరియల్​ టార్గెట్​ సాధించడం కష్టమని ఆఫీసర్లు చెపుతున్నారు. 

అలవెన్స్​లు,  ప్రత్యేక వసతులు బంద్​..

ఇన్నాళ్లు ఉపాధి పథకంపైనే గ్రామాల్లో  శ్మశాన వాటికలు, నర్సరీలు,  పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, హరితహారం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ ఏడాది నుంచి కేంద్రం డైరెక్ట్​గా ఉపాధి పథకాన్ని పర్యవేక్షిస్తోంది.  దీంతో గతంలో  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యే క అలవెన్స్​లు ఇవ్వడం ఆపేసింది.  ఉపాధి పథకం కేంద్రం ఆధీనంలోకి వెళ్లిందన్న అక్కసుతో  కూలీలకు వేసవి సీజన్​లో ఇవ్వాల్సిన స్పెషల్​ అలవెన్స్​ఇవ్వడం ఆపేసింది. పైగా పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కల్పించాల్సిన ప్రత్యేక వసతులు,  సామాను రిపేర్లకు డబ్బులు ఇవ్వట్లేదు.  గతేడాది నర్సరీలకు సరఫరా చేసిన మట్టితోలకం డబ్బులే ఇప్పటి వరకు సర్పంచులకు ఇవ్వలేదు. గతేడాది గ్రామాల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన మెటీరియల్​ డబ్బులు కూడా చెల్లించలేదు. దీంతో ఉపాధి పథకం కింద ప్రభుత్వం చేపడుతున్న పనులపై ఇటు కూలీలు, అటు స ర్పంచులు ఆసక్తి చూపించడం లేదు. 

ఉపాధి పథకంలో వచ్చిన సాఫ్ట్​వేర్​ మార్పులు కూడా కూలీలకు కొత్త సమస్యలు తీసుకొచ్చాయి. పనుల్లో జరిగే అక్రమాలు, అవినీతి చెక్​ పెట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఐసీ సాఫ్ట్​ వేర్​ సవాల్​గా మారింది.  ఈ సాఫ్ట్​వేర్​ వచ్చాక ఉదయం, సాయంత్రం కూలీల హాజరు తీసుకోవాల్సిరావడం, పనులు జరుగుతున్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి నేషనల్​ మొబైల్​ మానిటరింగ్​ సిస్టమ్​ (ఎన్ఎంఎంఎస్​)లో అప్​లోడ్​ చేయాల్సి వస్తోంది.  గతంలో 20 మంది కూలీలకు ఒక మేట్​ ఉండడంతో  కూలీల హాజరుకు ఇబ్బంది లేకుండా పోయింది.  కానీ ఇప్పుడు గ్రామాల్లోకి కూలీలు అందరికీ ఒక్కడే మేట్​ ఉండడంతో  హాజరు తీసుకోలేకపోతున్నారు.  దీంతో వారానికి రెండు సార్లు జరిగే కూలీల వేతన చెల్లింపులు కూడా ఆలస్యమవుతున్నాయి.  ఏప్రిల్​ వేతనాలు ఇంకా కూలీల​ అకౌంట్లలో పడలేదు. దీంతో ఉపాధి పథకం పనులకు కూలీలు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. 

రాష్ట్రంలో కూలీల హాజరు పరిస్థితి..

గడిచిన మూడు రోజుల హాజరు పరిశీలిస్తే  రాష్ట్ర వ్యాప్తంగా 12,769  గ్రామపంచాయతీల్లో 9 నుంచి 10 లక్షల మంది మాత్రమే హాజరవుతున్నారు. ఈ నెల 21న 10,15,503 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా, గతేడాది ఇదే రోజున 14,27,351 మంది హాజరయ్యారు. ప్రభుత్వం పెట్టిన టార్గెట్​ ప్రకారం ప్రతీ గ్రామంలో రోజుకు 200 మంది కూలీలు పనులకు హాజరుకావాల్సి ఉండగా కేవలం 80 మంది మాత్రమే వస్తున్నారు. ఈ నెల 24 వ తారీఖున 9,01,039 మంది కూలీలు హాజరుకాగా, గతేడాది ఇదే రో జున 14.65 లక్షల మంది పనులు చేశారు.  25న రాష్ట్రవ్యా ప్తంగా 10.53 లక్షల మంది కూలీల హాజరు నమోదైంది.  యావరేజ్​గా  ఒక్కో గ్రామంలో 84 మంది కూలీలు మాత్రమే పనులకు వస్తున్నారు.  ఇ ప్పటి వరకు జరిగిన పనులను బట్టి టాప్​ వన్​లో నల్గొండ జిల్లాలో  రోజుకు 84,580 మంది కూలీలు పనులకు వస్తుండగా, సెకండ్​ ప్లేస్​లో  నిర్మ ల్​ జిల్లాలో 81,724 మంది ఉన్నారు. అత్యల్పంగా కరీంనగర్​ జిల్లాలో 13, 816 మంది కూలీలు మాత్రమే వచ్చారు. 

ఈ నెల టార్గెట్​ కష్టమే..

రాష్ట్రంలోని  32 జిల్లాలో  ఈ నెలాఖరు వరకు 2,74,51,811 పనిదినాలు కంప్లీట్​ చేయాల్సి ఉంది.  కానీ ఇప్పటి వరకు కేవలం 97,04,864  పనిదినాలు మాత్రమే కంప్లీట్​ చేశారు.  మొత్తం టార్గెట్​లో 35.68 శాతం పూర్తి చేయగలిగారు. ప్రస్తుతం ఆఫీసర్లు ఓవైపు వడ్ల కొనుగోళ్ల బిజీలో ఉన్నా రు. ఇంకోవైపు ఉపాధి పనుల టార్గెట్​ పెట్టడంతో కలెక్టర్లు,  ఆఫీసర్లు రెండువైపులా పరుగెత్తాల్సి వస్తోంది. టార్గెట్​ కంప్లీట్​ కాకుంటే ఎంప్లాయిస్​ శాలరీలు, అడ్మినిస్ట్రే టివ్​ ఖర్చులు కూడా వెల్లదీయడం కష్టమని ఓ జిల్లా ఆఫీసర్​ చెప్పారు.  గతంలో వంద రోజుల పనిదినాలు పూర్తిచేసిన ఒక కూలీకి రూ.27,200 వేతనం వచ్చేది.  కానీ ప్రస్తుతం వంద రోజుల పనిదినాలు పూర్తయినప్పటికీ వేతనం రూ.16వేలకు మించట్లేదు. పనిదినాలు పూర్తయినా, అందుకు సరిపడా వేతనం రాకపోవడంతోనే కూలీలు ఉపాధి పనులు అంటేనే మొహం చాటేస్తున్నారని జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడు సగటున రోజుకు కూలీ రూ.137లకు మించి గిట్టుబాటు కావడం లేదని ఉపాధి సిబ్బంది వాపోతున్నారు.