- ఈ పార్క్ పునరుద్ధరణకు కృషి చేసిన కాకా వారసులకు కృతజ్ఞతలు: సతీశ్ మాదిగ
హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలో లెదర్ పార్క్ పునరుద్ధరణకు కృషి చేసిన కాకా వారసులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు తెలంగాణ మాదిగ చర్మకార సంఘాల జేఏసీ కో ఆర్డినేటర్, కాంగ్రెస్ నేత సతీశ్ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. పార్క్ కోసం రూ.20 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులు కూడా మంజూరు చేయించారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లెదర్ పార్క్ అందుబాటులోకి వస్తే వేలాది మంది చర్మకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు.
లెదర్ పరిశ్రమ మూతపడడంతో కార్మికులు రోడ్డున పడటంతో పాటు ఫ్యాక్టరీలోని సామగ్రి పనికి రాకుండా పోయిందన్నారు. కాకా వారసులు మందమర్రి లిడ్ క్యాప్‌ను అభివృద్ధి చేయడంతో పాటు వేలాది మంది మాదిగ చర్మకారులకు జీవనోపాధి కల్పించాలన్న సంకల్పంతో ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు. తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేసి మాదిగ కుటుంబాలకు లెదర్ డెవలప్‌మెంట్‌లో భాగంగా శిక్షణ ఇప్పించాలని ఆయన కోరారు. అలాగే, స్కిల్ యూనివర్సిటీలో లెదర్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కోర్సు ప్రవేశపెట్టి, మాదిగలకే సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.