- కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: బాలికల సంరక్షణ, సంక్షేమానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. జాతీయ బాలికల దినోత్సవం, బేటీ బచావో–బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లను బతికించుకుందాం, వారిని చదివించుకుందాం, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, సమాజంలో స్వేచ్ఛగా ఎదగనిద్దామని అన్నారు.
బాలికల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు చదువుతో పాటు
క్రీడారంగంలో రాణించాలని కోరారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ స్కూళ్లలో నిర్వహించిన ఆటలపోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.
మహిళా క్యాంటీన్ లో నాణ్యత పాటించాలి
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో నాణ్యత పాటించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ సముదాయంలో నిర్వహిస్తున్న క్యాంటీన్ ను సందర్శించారు. నాణ్యత పాటిస్తూ క్యాంటీన్ కు వచ్చే వారికి రుచికరమైన ఆహారం అందించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, డీఆర్డీవో దత్తారాం, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.