
ఇష్టమైన ఉద్యోగం, సరిపడా జీతం, సాఫీగా సాగిపోతున్న జీవితం. గవర్నమెంట్ జాబ్ చేస్తుండడంతో కరోనా టైంలో కూడా ఆర్థిక ఇబ్బందులు రాలేదు. కానీ.. తన చుట్టూ ఉన్న తోటి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అది చూసి తట్టుకోలేకపోయింది సోనియా దహియా. వాళ్లకు ఎలాగైనా చేయూతనివ్వాలి అనుకుంది. అందుకే పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టింది. దాంతో ప్రతినెలా సోనియాకు కొంత ఆదాయం, ఆ మహిళలకు జీతం అందుతున్నాయి.
సోనియా దహియాది హర్యానాలోని సోనిపట్‌కు దగ్గర్లోని ఒక చిన్న గ్రామం. బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. డీన్‌బంధు ఛోటు రామ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. రోజూ యూనివర్సిటీకి వెళ్లి బోటనీ పాఠాలు చెప్పడం, చీకటిపడేసరికి ఇంటికి చేరుకోవడం ఇదే ఆమె డైలీ రొటీన్. అయితే.. కరోనా వచ్చి ఆమెని ఇంటికే పరిమితం చేసింది. ఆన్లైన్లోనే క్లాస్‌లు చెప్పేది. దాంతో చాలా ఖాళీ టైం దొరికేది.
ఆ టైంలో చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడేది. అప్పుడే ఆమె గ్రామీణ మహిళల కష్టాలను తెలుసుకుంది. ముఖ్యంగా కరోనా టైంలో చదువు లేని, ఆర్థిక స్వాతంత్ర్యం లేని ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆమె మనసును కదిలించాయి. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది.
ఆన్లైన్లో రీసెర్చ్
సోనియాకు అప్పటికే పుట్టగొడుగుల పెంపకంపై కొంత అవగాహన ఉండడంతో దానిపై ఆన్లైన్లో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. లెక్కలేనన్ని గంటలపాటు వీడియోలు చూసింది. రీసెర్చ్ పేపర్స్ చదివింది. ప్రొఫెసర్ అయినా.. ఒక స్టూడెంట్‌లా ప్రతి విషయాన్ని పెన్నుతో రాసి నోట్స్ తయారుచేసుకుంది. చివరకు పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకుంది. ఆ తర్వాత ఫామ్ ఏర్పాటు చేస్తానని ఇంట్లో చెప్పింది. అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త విజయ్ దహియా మొదట్లో ఒప్పుకోలేదు.
ఇద్దరికీ గAవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ భద్రత ఉంది. అలాంటప్పుడు మళ్లీ స్టార్టప్ పెట్టి రిస్క్ తీసుకోవడం అవసరమా?” అన్నాడు. అయినా ఆమె నిరుత్సాహపడకుండా పట్టుదలతో తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. చివరికి విజయ్‌ని ఒప్పించింది.
40 లక్షలతో ఫామ్
అప్పటివరకు తన భర్త, తను కలిసి సంపాదించిన రూ. 20 లక్షలతో రెండు గదుల ఫామ్‌ని ఏర్పాటు చేసింది. దానికి ‘‘డాక్టర్ దహియా మష్రూమ్ ఫామ్” అని పేరుపెట్టారు. ఆ తర్వాత మరో రూ. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి వ్యాపారాన్ని విస్తరించింది. అలా మొత్తం రూ. 40 లక్షలు ఖర్చయ్యింది. మొదటి బ్యాచ్‌లో 5,600 పుట్టగొడుగులను పెంచింది.
నా కోసం కాదు
‘‘మా ఇంట్లో ఇద్దరమూ సంసాదించేవాళ్లమే. కాబట్టి డబ్బు కోసం ఈ బిజినెస్ పెట్టలేదు. మా చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లు పడే కష్టాలు చూసి ఈ బిజినెస్ పెట్టా. స్కిల్స్ నేర్పించి, అవకాశాలు కల్పించి వాళ్లను శక్తివంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా” అంటోంది సోనియా. తోటి ఆడవాళ్ల కోసం కృషి చేస్తున్న సోనియా ఎంతోమంది ప్రేమ, మెప్పుని పొందింది. ఆమెని చాలామంది ‘‘హర్యానా మష్రూమ్ విమెన్” అని కూడా పిలుస్తుంటారు.
15 మందికి ఉపాధి
సోనియా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో మష్రూమ్ ఫామ్‌ని చూసుకోవడానికి కావాల్సినంత టైం దొరకడం లేదు. దాదాపు అన్ని పనులను సిబ్బందికే అప్పగిస్తుంటుంది. ఫామ్‌లో పది మంది మహిళలకు శాశ్వత ఉద్యోగాలు, మరో 15 మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్లలో ఎక్కువమంది వితంతువులు, విడాకులు తీసుకున్న వాళ్లే ఉన్నారు. ఒకప్పుడు వాళ్లంతా చేతిలో పనిలేక మూడు పూటలా తినడానికి కూడా ఇబ్బంది పడినవాళ్లే. ఫామ్‌లో ఉద్యోగం దొరకడంతో జీవితాలు చాలా మారాయి.
ముఖ్యంగా ఫామ్‌లో పనిచేసే సవిత, పింకీ దేవి లాంటివాళ్లు ఈ ఉద్యోగం దొరకడం వల్ల ఎన్నో వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కోగలిగారు. పింకీ దేవి మాట్లాడుతూ.. ‘‘గతంలో నేను రోజూ ఎండలో పనిచేసేదాన్ని. కానీ.. ఇప్పుడు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో హాయిగా పనిచేస్తున్నా. నాకు ఇక్కడ గడపడం చాలా ఇష్టం. రోజంతా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటాం. కొన్నిసార్లు సరదాగా అందరం కలిసి డ్యాన్స్ చేస్తుంటాం. చాయ్, పకోడా లాంటివి చేసుకుని ఆస్వాదిస్తాం” అంటూ చిరునవ్వుతో తన అనుభవాలను పంచుకుంది.
మొదట్లో విఫలం
అనుభవం లేకపోవడంతో ఫామ్ పెట్టిన కొత్తలో నష్టాలు తప్పలేదు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న మెళకువలతో తర్వాత సక్సెస్ అయ్యింది. మొదట్లో మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే కంపోస్ట్ వాడారు. అది నాసిరకంగా ఉండడంతో మష్రూమ్స్ అనుకున్నంతగా ఎదగలేదు. పైగా.. రెగ్యులర్‌గా కరెంట్ కోతలు ఉండడంతో ఏసీలు పనిచేయక దిగుబడి తగ్గింది. అప్పుడే పుట్టిన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో మష్రూమ్స్ పెంపకం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని సోనియాకు అర్థమైంది.
సొంత కంపోస్ట్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది. ‘‘పుట్టగొడుగుల పెంపకానికి కంపోస్ట్ చాలా ముఖ్యం. మేము కొన్నిసార్లు తడిసిన కంపోస్ట్‌ను కొనడం వల్ల రూ. 2 లక్షల వరకు నష్టపోయాం. అందుకే స్థానికంగా దొరికే వరి గడ్డి, కోడి ఎరువు, గోధుమ ఊక లాంటి వాటిని ఉపయోగించి కంపోస్ట్ తయారు చేసుకోవడం ప్రారంభించాం”అని చెప్పుకొచ్చింది సోనియా.
ఎలా పెంచుతారు
డాక్టర్ ‘దహియా మష్రూమ్ ఫామ్’లో పుట్టగొడుగులను పెంచే విధానాన్ని సోనియా ఇలా వివరించింది. ‘‘మష్రూమ్స్ పెంచే గదుల్లో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ లెవల్స్‌ని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంటాం. మొదటి 40 రోజులు కిటికీలను మూసి ఉంచుతాం. సంచులపై పుట్టగొడుగులు ఏర్పడిన తర్వాత వాటికి ఆక్సిజన్ చాలా అవసరం. కాబట్టి వెంటిలేషన్ కోసం అప్పుడప్పుడు కిటికీలను తెరుస్తాం. ఆ టైంలో టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ముఖ్యం. మష్రూమ్ బాగా పెరగాలంటే టెంపరేచర్లు 23 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండాలి.
నేను బయోటెక్నాలజీ చదవడం వల్ల సైంటిఫిక్ స్కిల్స్ బాగా తెలుసు. అందుకే వీటిని పెంచడం ఈజీ అయ్యింది. ముఖ్యంగా బటన్ మష్రూమ్స్‌ని పెంచుతున్నాం. ఈ రకం పుట్టగొడుగులను ఏడాది పొడవునా ఉత్పత్తి చేయొచ్చు. ఒక బ్యాచ్ చేతికి రావడానికి రెండు నెలలు పడుతుంది’’అంటోంది సోనియా.
15 మందికి ఉపాధి
సోనియా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో మష్రూమ్ ఫామ్‌ని చూసుకోవడానికి కావాల్సినంత టైం దొరకడం లేదు. దాదాపు అన్ని పనులను సిబ్బందికే అప్పగిస్తుంటుంది. ఫామ్‌లో పది మంది మహిళలకు శాశ్వత ఉద్యోగాలు, మరో 15 మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్లలో ఎక్కువమంది వితంతువులు, విడాకులు తీసుకున్న వాళ్లే ఉన్నారు. ఒకప్పుడు వాళ్లంతా చేతిలో పనిలేక మూడు పూటలా తినడానికి కూడా ఇబ్బంది పడినవాళ్లే. ఫామ్‌లో ఉద్యోగం దొరకడంతో జీవితాలు చాలా మారాయి.
ముఖ్యంగా ఫామ్‌లో పనిచేసే సవిత, పింకీ దేవి లాంటివాళ్లు ఈ ఉద్యోగం దొరకడం వల్ల ఎన్నో వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కోగలిగారు. పింకీ దేవి మాట్లాడుతూ.. ‘‘గతంలో నేను రోజూ ఎండలో పనిచేసేదాన్ని. కానీ.. ఇప్పుడు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో హాయిగా పనిచేస్తున్నా. నాకు ఇక్కడ గడపడం చాలా ఇష్టం. రోజంతా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటాం. కొన్నిసార్లు సరదాగా అందరం కలిసి డ్యాన్స్ చేస్తుంటాం. చాయ్, పకోడా లాంటివి చేసుకుని ఆస్వాదిస్తాం” అంటూ చిరునవ్వుతో తన అనుభవాలను పంచుకుంది.
మరో రెండు గదులు
పుట్టగొడుగుల పెంపకంలో సక్సెస్ కావడంతో 2022 నాటికి మరో రెండు గదులను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ప్రతినెలా 10 టన్నుల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని అమ్మడం ద్వారా నెలకు రూ. 12 లక్షలకు పైగానే సంపాదిస్తోంది. ఫామ్‌లో పనిచేస్తున్న మహిళల వేతనాలు, పెట్టుబడి పోను నెలకు లక్ష రూపాయలకు పైగా సోనియాకు మిగులుతోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలో టోకు వ్యాపారులకు, స్థానిక క్యాటరర్స్కు, చిన్న రెస్టారెంట్‌లకు పుట్టగొడుగులను సరఫరా చేస్తోంది.
పని దొరికేది కాదు
ఫామ్‌లో పనిచేసే 40 ఏళ్ల సవిత గతంలో రోజువారీ కూలీగా పనిచేసేది. “గతంలో రోజుకు రూ. 250 సంపాదించడానికే చాలా కష్టపడ్డా. రోజంతా ఎండలో కష్టపడేదాన్ని. అయినా.. కొన్నిసార్లు వరుసగా 10 రోజుల వరకు పని దొరికేది కాదు. ఇప్పుడు నెలకు రూ. 11,500 సంపాదిస్తున్నా” అని సంతోషంగా చెప్పింది సవిత. ఇక్కడ ఉద్యోగం చేయడం వల్ల తన కుటుంబానికి మూడు పూటలా తిండి పెట్టగలుగుతోంది.