- మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై నిపుణుల ఆరా
- ఇంజినీరింగ్ బాధ్యులతో వేర్వేరుగా ఎక్స్ పర్ట్స్ భేటీ
- తాత్కాలిక మరమ్మతులపైనా చర్చిస్తున్న ఆఫీసర్లు
- అధికారులతో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా డిస్కషన్
హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం డ్యామేజీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం జలసౌధలో ఇవాళ అప్పటి ఇంజినీర్లు బాధ్యులతో వేర్వేరుగా మాట్లాడింది. ఉదయం జలసౌధకు చేరుకున్న ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ తొలుత తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో భేటీ అయ్యింది. తర్వాత ఈఎన్సీలు ఒక్కక్కరితో చర్చించారు. అయితే ఈ కీలక సమావేశానికి తప్పక హాజరు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఇంజినీర్ ను రావాలని ప్రభుత్వం ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈఎన్సీగా వ్యవహరించిన మురళీధర్ రావుకూ సమాచారం వెళ్లింది. అయితే సర్కారు ఆదేశాలను ఆయన బేఖాతరు చేశారు. సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన గైర్హాజరు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
డ్యామేజీ ఎలా జరిగింది?
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుకు కారణాలు, లోపాలను తేల్చేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆరుగురు సభ్యుల బృందం తొలి రోజు మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించింది. రెండోరోజు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ ప్రాంతాల్లో పర్యటించింది. అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో బుంగలను పరిశీలించింది. తర్వాత బ్యారేజ్ 5 బ్లాక్‌లోని 38వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్‌ను స్థానిక అధికారులతో కలిసి సందర్శించింది. ఆయా బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించి.. రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు బ్యారేజ్‌పైనే తిరిగి వివరాలు సేకరించారు. కాపర్ డ్యామ్ ద్వారా కిందకు వెళ్లారు. 7వ బ్లాక్‌లో 18, 19, 20, 21 పిల్లర్లను పరిశీలించారు. బ్యారేజ్‌లోని 8 బ్లాక్‌లను దశల వారీగా పరిశీలించి.. పూర్తిగా వీడియో, ఫోటోగ్రఫి నిర్వహించారు. ఒక రోజంతా మేడిగడ్డ బ్యారేజ్ వద్దే వివరాలు సేకరించిన నిపుణుల కమిటీ.. బ్యారేజ్ అప్ స్ట్రీమ్– డౌన్ స్ట్రీమ్ వైపు విచారణ జరిపారు. ప్రధానంగా.. 20వ పిల్లర్ కుంగుబాటుపై లోతుగా అధ్యయనం జరిపారు. పగుళ్ల కొలతలను రికార్డు చేసిన నిపుణులు.. డ్యామేజ్‌కు ముందు డామేజ్ తర్వాత తీసుకున్న చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు.
ALSO READ :- రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో అనిమానితుడి ఫొటోలు
తాత్కలిక మరమ్మతులెలా?
వర్షాకాలంలోపు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉంటుందని ఎన్డీఎస్ఏ నిపుణులు ఇంజినీర్లకు సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఏం చేయాలనే విషయమై ఇవాళ జలసౌధలో జరిగిన భేటీలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లతో చర్చించారు.