
- కేఎల్‌ఐ, భగీరథ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఈఎన్సీ టీమ్
- ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా చూస్తామన్న ఆఫీసర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు : నిర్మాణంలో ఉన్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను మంగళవారం ఈఎన్‌సీ అనిల్ కుమార్ టీమ్ పరిశీలించారు. పాలమూరు–-రంగారెడ్డి, కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్, ఎల్లూరు భగీరథ స్కీంల మెయిన్ కెనాల్స్, పంప్‌హౌజ్‌లు, రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఈఈలు, డీఈలు మ్యాప్‌ల ద్వారా వివరించారు. అనంతరం వట్టెం వెంకట్రాది రిజర్వాయర్, కుమ్మెరలో పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి పనులు ఎక్కడి వరకు వచ్చాయో ఆరా తీశారు.
పెండింగ్ పనులను వెంనటే చేపట్టాలని ఆదేశించారు. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు దగ్గర మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. ఐదేండ్ల కింద జరిగిన ఘటనలో రెండు పంపులు మూలకు పడగా, వాటి రిపేర్ అంశంపై చర్చించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్, మెయిన్‌కెనాల్, పంప్‌హౌజ్, సొరంగం పనులను పరిశీలించి గడువులోగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వట్టెం ప్యాకేజీలోని పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలను ఈఈ పార్థసారథి వివరించారు.
యాభై టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుల్లో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లు పూర్తి చేసి యాభై టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్ పనుల వివరాలు తెలుసుకునేందుకే ఫీల్డ్ విజిట్‌కు వచ్చామని ఈఎన్‌సీ అనిల్‌కుమార్ చెప్పారు. శ్రీశైలంలో 817 అడుగుల మేర నీరు నిల్వ ఉందని, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వారి వెంట ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, డివిజన్ 1ఈఈ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.