
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం హంటింగ్ కొనసాగుతోంది. ఉగ్రమూకలను అంతమొందించేందుకు భారత భద్రతా దళాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం (ఏప్రిల్ 25) కుల్నార్, బందిపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన జవాన్లు.. బందిపోరాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
జవాన్ల రాకను గమనించిన ఉగ్రమూకలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులను తుదిముట్టించే వరకు ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు.
కాగా, జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పహల్గాంకు కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను అణువణువునా శోధిస్తున్నారు.