జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ వీర మరణం

జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ వీర మరణం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని సోపోరాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు వీర మరణం చెందాడు. మరికొందరు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు. కాగా, సోపోరాలో ఓ రహస్య స్థావరంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం  మేరకు ఆదివారం (జనవరి 19) రాత్రి సైనికులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు తారసపడ్డ టెర్రరిస్టులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. 

ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎన్ కౌంటర్లో గాయపడిన జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం (జనవరి 20) మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోన్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో సోపోరా ప్రాంతాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోన్నారు.