జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఇండియన్ ఆర్మీ చేతిలో ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఇండియన్ ఆర్మీ చేతిలో ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. 2024, నవంబర్ 2 శనివారం అనంతనాగ్‌ జిల్లాలోని లార్నూ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‎లో భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. కాగా, హల్కన్ గలీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న ఇంటలిజెన్స్ సమచారంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు.. సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. 

ఈ క్రమంలోనే భద్రత దళాలకు తారసపడ్డ టెర్రరిస్టులు.. జవాన్లపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు విదేశీయుడు కాగా, మరొకరు స్థానికుడని సమాచారం. అయితే, ఉగ్రవాదులు ఏ గ్రూప్‏కు చెందినవారు అనేది ఇంకా అధికారులు నిర్ధారించలేదు. 

జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత సైన్యం ధృవీకరించింది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‎లో దాడి జరిగిన గంట తర్వాత ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీనగర్, అనంతనాగ్‌, బందీపూర్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.