
భద్రాచలం, వెలుగు: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. బాలాఘాట్ జిల్లా గఢీ పోలీస్స్టేషన్ పరిధిలోని సూప్ఖర్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, జిల్లా పోలీసులతో పాటు హాక్ ఫోర్స్ ను రంగంలోకి దించారు.
రౌందా ఫారెస్ట్ క్యాంప్ సమీపంలోమావోయిస్టులను బలగాలు గుర్తించాయి. భారీ సంఖ్యలో చేరుకున్న బలగాలను చూసి మావోయిస్టులు పారిపోతూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా, మిగిలిన వారు సమీప అడవుల్లోకి పారిపోయారు. మరికొందరికి గాయాలైనట్లుగా బలగాలు చెబుతున్నాయి. మృతులను గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఇన్సాస్, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మావోయిస్టు పార్టీని నియంత్రించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.