లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఝిన్ఝానా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముస్తాఫా గ్యాంగ్ సభ్యులకు, యూపీ ఎస్టీఎఫ్ పోలీసులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముస్తాఫా గ్యాంగ్ సభ్యులు నలుగురు మృతి చెందారు. దుండగుల కాల్పుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఇన్స్పెక్టర్ను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన ముస్తాఫా ముఠా సభ్యులను సతీష్, అర్షద్, మన్జీత్ గా గుర్తించిన పోలీసులు.. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న ముస్తాఫా ముఠా సభ్యులను పట్టుకునేందుకు యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.
ALSO READ | నక్సలిజానికి చివరి రోజులు : అమిత్ షా సంచలన ట్విట్
ఈ క్రమంలో పోలీసులను చూసిన క్రిమినల్స్ కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్లో ఒకేసారి నలుగురు క్రిమినల్స్ మృతి చెందడంతో యూపీలోని గ్యాంగ్స్టర్లు అలర్ట్ అయ్యారు. పోలీసుల నుండి తప్పించుకునేందుకు అండర్ గ్రౌండ్కు వెళ్తున్నారు.