ఉత్తరప్రదేశ్‎లో ఎన్​కౌంటర్.. ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టుల కాల్చివేత

ఉత్తరప్రదేశ్‎లో ఎన్​కౌంటర్.. ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టుల కాల్చివేత

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లోని పిలిభిత్‌‌లో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్‌‌కౌంటర్‌‌ జరిగింది. యూపీ, పంజాబ్ పోలీసులు పురాన్‌‌పూర్‌‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్, రెండు గ్లాక్  పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌‌లోని గురుదాస్‌‌పూర్‌‌లో ఉన్న పోలీసు పోస్ట్‌‌పై గతంలో  గ్రనేడ్‌‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్తానీ టెర్రరిస్టులు యూపీలో ఉన్నట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందించింది. 

దీంతో అప్రమత్తమైన యూపీ, పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. టెర్రరిస్టులు పురాన్‌‌పూర్‌‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌‌కౌంటర్‌‌లో తొలుత ఖలిస్తానీ టెర్రరిస్టులు గాయపడగా.. పురాన్‌‌పూర్‌‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

తర్వాత వారు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. మృతులను గుర్విందర్ సింగ్(25), వీరేంద్ర సింగ్(23), జస్​ప్రీత్ సింగ్(18)గా పోలీసులు ఐడెంటీఫై చేశారు. ఎన్‌‌కౌంటర్‌‌పై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "టెర్రరిస్టుల కదలికలపై సమాచారం అందడంతో యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. 

ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టులు ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. మృతులకు ‘పాక్ స్పాన్సర్డ్ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్’ టెర్రర్ మాడ్యూల్​తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ ఎన్‌‌కౌంటర్‌‌లో పోలీసులు సుమిత్ రాఠి, షానవాజ్ కూడా గాయపడ్డారు. ఆ ప్రదేశంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది" అని ట్వీట్ చేశారు. ఈ టెర్రర్ మాడ్యూల్‌‌ను పాక్‌‌కు చెందిన కేజెడ్‌‌ఎఫ్ చీఫ్ రంజీత్ సింగ్ నీతా నియంత్రిస్తున్నారని పంజాబ్ పోలీసులు తెలిపారు.