- చత్తీస్‌గఢ్ రాష్ట్రం గంగులూరు పీఎస్ పరిధిలో ఘటన
- మందుపాతర పేలడంతో ఓ జవాన్‌కు గాయాలు
- ఇన్‌ఫార్మర్ పేరుతో బీజేపీ లీడర్‌ను హత్య చేసిన మావోయిస్టులు
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు పీఎస్ పరిధిలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. మునగా అడవుల్లో డీవీసీఎంలు దినేశ్ మొడియా, ఆకాశ్ హేమ్లా, కంపెనీ నంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లుతో పాటు 30 నుంచి 40 మంది మావోయిస్టులు సమావేశం అయ్యారని బలగాలకు సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ ప్రారంభించారు. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో జవాన్లు సైతం ఎదురుకాల్పులు మొదలుపెట్టారు.
మావోయిస్టులు కాల్పులు చేసుకుంటూ అడవిలోకి పారిపోయారు. అనంతరం బలగాలు ఘటనాస్థలాన్ని పరిశీలించగా ఓ మావోయిస్ట్ డెడ్‌బాడీతో పాటు 9 ఎంఎం పిస్టల్, ఐఈడీలు, ఆరు రిమోట్లు దొరికాయి. ఈ క్రమంలో ఒక ఐఈడీ పేలడంతో డీఆర్జీ జవాన్ గాయపడ్డారు. అతడిని బీజాపూర్ జిల్లా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అతడి పరిస్థితి సాధారణంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కూంబింగ్ కొనసాగుతోందని, పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలను బీజాపూర్‌కు పంపుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
బీజేపీ లీడర్‌ను హత్య చేసిన మావోయిస్టులు
చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సోమన్‌పల్లికి చెందిన బీజేపీ లీడర్ కుడియం మధు (35)ను మావోయిస్టులు బుధవారం హత్య చేశారు. తన ఇంట్లో ఉన్న మధును మంగళవారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ కత్తులతో పొడిచి హత్య చేసిన అనంతరం డెడ్‌బాడీని టోయనార్ గ్రామం వద్ద రోడ్డుపై పడేశారు.
ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్న మధును పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా పట్టించుకోక పోవడం వల్లే హత్య చేసినట్లు మావోయిస్టులు లెటర్ వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు.