భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా, దంతెవాడ జిల్లాల్లో శనివారం వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిలువరించేందుకు చత్తీస్‌గఢ్ పోలీసులు భారీ సంఖ్యలో బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమార్‌గట్ట, సింగారం అడవుల్లో జేగురుగొండ ఏరియా కమిటీ మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందడంతో డీఆర్‌జీ బలగాలు శుక్రవారం రాత్రి నుంచే కూంబింగ్ చేపట్టాయి.
శనివారం ఉదయం బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. దీందో భద్రతాబలగాలు సైతం కాల్పులు ప్రారంభించారు. 20 నుంచి 25 నిముషాల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే దంతెవాడ జిల్లా పురంగేల్ ఈర్లగూడెం వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో గంగలూరు ఏరియా కమిటీ సభ్యురాలు పూనెం సుక్కు చనిపోయింది. ఆమెపై రూ.ఐదు లక్షల రివార్డు ఉంది.12 బోర్ తుపాకీ, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇల్మిడిలో చనిపోయిన మావోయిస్ట్ గుర్తింపు
తెలంగాణ-, చత్తీస్‌గఢ్ పోలీసులు బీజాపూర్ జిల్లా ఇల్మిడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెమల్దోడి అడవుల్లో శుక్రవారం నిర్వహించిన జాయింట్ఆపరేషన్లో చనిపోయిన మావోయిస్ట్‌ను బామన్ మడకం (25)గా గుర్తించారు. ఇతడు బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడిగా, ప్లాటూన్ నంబర్ 2 సెక్షన్ బి.కమాండర్‌గా వ్యవహరిస్తున్న బామన్‌పై రూ.3 లక్షల రివార్డు ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.