- పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్
బషీర్‌బాగ్, వెలుగు: చత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్, తుల్‌తుల, నెందూర్ గ్రామాల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
ఆదివాసీలను చంపి, భయానక వాతావరణం సృష్టించి అడవిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో దండకారణ్య నేతలు కేశవరావు, వాసుదేవరావు ఉన్నట్లు సమాచారం ఉందని, మృతుల వివరాలు, వారి ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించకుండా, మావోయిస్టుల ఏరివేతపైనే దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి రవి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తిరుమలయ్య, కుమారస్వామి పాల్గొన్నారు.