పెండ్లి హక్కును  గౌరవించాలి

ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న మనదేశంలో అన్ని హక్కులతో పాటు పెండ్లి హక్కుకు గవర్నమెంట్​ ప్రత్యేక స్థానం కల్పించింది. ఏ వ్యక్తి అయినా హక్కుల సిద్ధాంతం ప్రకారం  ఆలోచించి సొంత నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మనదేశంలో ఉంది. కానీ ఇప్పుడా హక్కులకు భంగం కలుగుతోంది. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు కాదుకదా! కనీసం సొంత ఆలోచన కూడా చేయలేని దుస్థితికి యువత చేరుకుంటోంది. దానికి నిదర్శనం కండ్ల ముందు మతాల.. కులాల పేరుతో జరిగే పరువు హత్యలే. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడే మనిషి తన శక్తి యుక్తులను ఉపయోగించే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికీ మేలు జరుగుతుంది. కట్టుబాట్లు.. సాంప్రదాయాల పేరుతో కట్టడి విధిస్తే జరిగే పరిణామాలు కండ్లెదురుగా కనిపిస్తున్నాయి. హక్కుల సిద్ధాంతం మనుషుల మధ్య సంబంధాలను మార్చి వేస్తోంది. ఒక మనిషిపైన వేరొక మనిషి పెత్తనం ఎవరూ సహించలేనిది. మనుషులు  పరస్పర గౌరవ భావంతో, సమానులుగా  జీవించడానికి హక్కులు అవకాశం కల్పిస్తాయి. ఈ మార్పే ఆధునిక నాగరిక సమాజ ఎదుగుదలకు దారి తీసిందన్న విషయాన్ని మనం మరవకూడదు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒకే ఒక్క కారణంగా ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజును అందరూ చూస్తుండగానే సరూర్​నగర్ వద్ద నడి రోడ్డుపైన ఇనుప రాడ్లతో కొట్టి, కత్తులతో పొడిచి చంపేసిన ఘటన  మొత్తం సమాజాన్ని కలచివేసింది.  బతికి ఉంటే 10.5.-2022న భార్యతో కలిసి నాగరాజు 25వ పుట్టిన రోజు జరుపుకునే వాడు. అతనొక దళితుడు. తల్లిదండ్రులకు ఉన్న ఇద్దరు సంతానంలో ఇతను పెద్ద వాడు కాగా తరువాత ఒక  అమ్మాయి ఉంది. ఆ కుటుంబానికి ఆస్తి పాస్తులు లేవు. కూలినాలి చేసుకొని బతుకుతారు. ఆ పైసలతోనే నాగరాజును చదివించారు. ఆయన  ఐటీఐ చేసి దూర విద్య మాధ్యమం ద్వారా డిగ్రీ పూర్తి చేసిండు.  మర్పల్లి దళితవాడలోని ఒక పూరింట్లో వీరి కుటుంబం నివాసం ఉంటోంది. నాగరాజు కష్టపడి పని చేసి ఉన్నంతలో కుటుంబాన్ని ఆదుకునేవాడు. రోజంతా బస్ డిపోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా  పనిచేసి ఆ పైసలు ఖర్చులకు చాలవని రాత్రిళ్ళు డ్రైవింగ్ చేసేవాడు. పెళ్ళయిన తరువాత పాత ఉద్యోగం వదిలి  ఒక కార్ల షోరూమ్ లో పనిలో   చేరిండు. 
 

కలిసి జీవించడానికి మతం అడ్డు వస్తే..
డిగ్రీ పూర్తి చేసిన ఆశ్రీన్​ను ఈ సంవత్సరం జనవరి 31న హైదరాబాద్ ఆర్య సమాజంలో నాగరాజు పెండ్లి చేసుకున్నాడు. ఆశ్రీన్​ ఇంటర్​ చదువుతున్నప్పుడు నాగరాజుతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారాక, ఒక నాలుగు నెలల నుండి వారిద్దరూ  పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంకా చదవాలి అనుకున్నా.. ఆశ్రీన్​ తండ్రి చనిపోవడంతో ఆ ఆలోచనకు ఆమె పుల్​స్టాప్​ పెట్టింది. ఇన్ని వివరాలు ఎందుకు చెబుతున్నానంటే వారు లోతుగా ఆలోచించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారన్న వాస్తవాన్ని వెలుగులోనికి తేవడానికే. అమ్మాయి తల్లిదండ్రులను కూడా  ఒప్పించిన తర్వాతే నాగరాజు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకే ఆయన ఆశ్రీన్  తల్లిని కలిసి ఇద్దరి పెళ్ళికి అంగీకరించాలనిఅడిగిండు. నాగరాజు తన మతాన్ని, కులాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆశ్రీన్‌‌తో కలిసి జీవించడం తప్ప  మరేది ముఖ్యం కాదనుకున్నాడు. ఆ అమ్మాయిని అంతగా ఇష్ట పడ్డాడు.  కలిసి జీవించడానికి మతం అడ్డుగా ఉంటే దాన్ని వదిలేస్తానన్నాడు. అయినా ఆశ్రీన్​ ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళు చూసిన అబ్బాయిని చేసుకోవాలని ఆశ్రీన్ పైన ఒత్తిడి తెచ్చారు. రక్తం కారేటట్టు కొట్టారంటే ఆ అమ్మాయి ఇంట్లో  ఎంతటి  హింసను అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. అయినా ఆ అమ్మాయి మనసు మార్చుకోలేదు. తెగించి ఇంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళి నాగరాజును పెళ్లిచేసుకుంది.  ఆశ్రీన్ తాను తీసుకున్న నిర్ణయం తన భవిష్యత్తుకు సంబంధించిందిగా, ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సింది కూడా తానే అని భావించింది. అందుకే తన కుటుంబ సభ్యుల జోక్యం అనవసరమనుకుంది. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛను కోరుకుంది. మొత్తం ఘటనకు సంబంధించి ఇదే కీలకమైన అంశం. 
 

పెళ్లి చేసుకునే హక్కు
అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్ 16 ప్రకారం యుక్త వయస్సు వచ్చిన స్త్రీ, పురుషులందరికీ  మతం, జాతి, జాతీయత విధించిన పరిమితులకు అతీతంగా పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే  హక్కు  ఉంది. పెండ్లి విషయంలో, వివాహ కాలంలో, విడాకులకు సంబంధించి స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉంటాయి. అంతేకాదు సబ్-క్లాజ్ (2) ప్రకారం వధూవరులు ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే  పెళ్లి జరగాలి. ఈ విషయాల ప్రకారం యుక్త వయసు వచ్చి ఇష్టపూర్వకంగా అంగీకరిస్తేనే అబ్బాయి, అమ్మాయి పెళ్లి జరగాలి. కులం, మతం, జాతి విధించిన కట్టుబాట్లను అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన గుర్తించడం లేదు. వాటికి అతీతంగా యువతీ యువకులకు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. పెళ్లి హక్కును భారత రాజ్యాంగంలో పొందుపర్చలేదు. అయితే  భారత రాజ్యాంగంలోని జీవించే హక్కు పెళ్లి చేసుకునే హక్కును కూడా కల్పిస్తున్నదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నాగరాజు, ఆశ్రీన్ లు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు గౌరవించి ఉంటే, వారి మధ్య తలెత్తే సమస్యలను ఎదుర్కోగల శక్తిని ఇవ్వడానికి ముందుకు వస్తే సంతోషంగా కలిసి కాపురం చేసే వాళ్ళు. కానీ మతం కట్టుబాట్ల పేరుతో విడదీసే ప్రయత్నం జరిగింది. మతం గీసిన హద్దులను చెరిపేయడానికి కూడా నాగరాజు పూనుకున్నాడని పైన వివరించా. అయినా వారి  పెండ్లిని ఆశ్రీన్ కుటుంబ సభ్యులు అంగీకరించ లేదు. బలవంతంగా విడదీసి ఆశ్రీన్ కు వేరే పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. చివరకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు నాగరాజుకు మరణ శిక్ష విధించి.. వారు పెళ్లి చేసుకునే హక్కును మతం పేరుతో నిరాకరించారు. 
 

కులాంతర, మతాంతర వివాహాలు తక్కువే..
మన దేశంలో మతాంతర, కులాంతర వివాహాలు తక్కువ. అసలు ఈ వివాహాలను రికార్డ్ చేసే వ్యవస్థ లేదు. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కులాంతర వివాహాలు మొత్తం వివాహాల్లో కేవలం 10 శాతమే. మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో కులాంతర వివాహాలు ఎక్కువ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​లో కులాంతర వివాహాలు మొత్తం వివాహాల్లో 9.6 శాతమే. జాతీయ సగటుకన్నా ఉమ్మడి రాష్ట్రంలో కులాంతర వివాహాలు తక్కువ. మతాంతర వివాహాలు మరీ తక్కువ.  మొత్తం వివాహాలలో మతాంతర వివాహాలు కేవలం కొద్ది శాతం మాత్రమే ఉన్నాయి. అవి కూడా పంజాబ్‌‌లో ఎక్కువ. కులం, మతం కట్టుబాట్లు ఎంత బలంగా పని చేస్తున్నాయో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. చదువుకుంటున్న విద్యార్థుల్లో 50 శాతానికి పైబడి కులాంతర, మతాంతర వివాహాలకు అనుకూలంగా ఉన్నారని మరొక అధ్యయనం తేల్చి చెప్పింది. బహుశ ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వారి  సంఖ్య ఇంకొంచెం పెరిగి ఉండవచ్చు. అంబేద్కర్ కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని అంటారు. కులాంతర వివాహాలు  ఎంత ఎక్కువగా జరిగితే భారత దేశంలో కులాలకు అతీతంగా సమాజంలో ఐక్యత అంతగా పెంపొందుతుందని ఆయన ఆశించారు.

కాలం గడిచి 21వ శతాబ్దంలో ప్రవేశించిన తరువాత కూడా కులాంతర, మతాంతర వివాహాలను సమాజం ఆమోదించడం లేదు. మన రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్​ని, అదేవిధంగా ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు మధుకర్‌‌‌‌ను చంపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి ఘటనలు ఇంకా చాలానే ఉన్నాయి.  తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నందుకు చంపడం అనాగరిక చర్య. మనిషిని మనిషిగా చూడటం లేదు. కులం ప్రాతిపదికన మాత్రమే గుర్తించడం అమానుషం, అన్యాయం. హత్యల దాకా వెళ్ళిన వివాహాలు కొన్ని. కానీ ప్రతి వివాహంలో ఏదో ఒక స్థాయిలో ఘర్షణ ఉంటోంది. 
 

కుల, మత మౌఢ్యం నుంచి బయటపడాలి..
పిల్లలు ఇష్టపడి చేసుకుంటున్న కులాంతర, మతాంతర వివాహాలకు ఆమోదాన్ని సాధించడానికి కృషి ఇటు సమాజ స్థాయిలోనూ అటు ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు జరగాలి. సమాజం కులమత మౌఢ్యం నుంచి బయట పడాలి. పిల్లలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి.  ప్రభుత్వం కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఇతర మతాల, కులాల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నందుకు మౌఢ్యంతో దాడి చేయడాన్ని నివారించేందుకు ప్రత్యేక చట్టం తేవాలి. కులాంతర, మతాంతర వివాహాలను రిజిస్టర్ చేసే చట్టబద్ధమైన వ్యవస్థ కూడా అవసరం.                                                                                                                                                                               - ఎం.కోదండరాం​, అధ్యక్షులు, తెలంగాణ జన సమితి