ధన్వాడ, వెలుగు : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తున్నామని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన సేవాలాల్ ప్రీమియర్ లీగ్, జూనియర్ క్రికెట్టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవానికి చీఫ్‌గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విన్నర్‌గా నిలిచిన రోహిత్కింగ్ లెవెన్ టీమ్‌కు రూ.28 వేలు, మూడుగుల మల్లయ్య తండాకు చెందిన శివాజీ మహరాజ్ టీమ్‌కు రూ.15 వేల నగదుతో పాటు షీల్డులు అందజేశారు. అలాగే రాష్ర్ట స్థాయిలో యోగా పోటీల్లో ప్రతిభ చూపిన రవీందర్పావన్ను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధన్వాడ మండల పరిధిలో పిల్లిగుండ్ల తండాలో క్రీడా ప్రాంగణం కోసం రూ.10 లక్షలు, సింగారం దగ్గర ఇండోర్ స్టేడియం కోసం రూ.11 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అమరేందర్ రెడ్డి, ఓన్యనాయక్, పూర్యనాయక్, ఎంపీటీసీ కడపయ్య, కార్యనిర్వహకులు సత్యనారాయణ్గౌడ్, మనోజ్‌నాయక్, భగవంత్నాయక్ పాల్గొన్నారు.
ప్రజలను ఏకం చేసేందుకే జోడోయాత్ర
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజలను ఏకం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో యూత్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మత విద్వేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతోందని విమర్శించారు. అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కో వ్యక్తి అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తామని హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పేదలకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా దళితబంధు పేరుతో రూ.10 లక్షలు చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఈనెల 23న ఉమ్మడి జిల్లాలో ఎంటర్ కానున్న జోడోయాత్రలో జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నేతలు పాండు, లక్ష్మయ్య, రాము పాల్గొన్నారు.
వనపర్తిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు
వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. ముందుగా వనపర్తి టౌన్ ఎస్సై యుగంధర్ రెడ్డి ఆర్ఏఎఫ్ ఫోర్స్ కు స్వాగతం పలికారు. అనంతరం 75 మందితో గాంధీ చౌక్ నుంచి ప్రారంభమైన కవాతు ఘన్ పూర్ క్రాస్ రోడ్, పోచమ్మ టెంపుల్, నూర్ మజీద్, కన్యకాపరమేశ్వరీ టెంపుల్, మారెమ్మ కుంట, ఓల్డ్ యూకో బ్యాంక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్ మీదుగా టౌన్ పీఎస్ వరకు కొనసాగింది. ప్రజలకు విపత్తులు, ఆపద సమయంలో ఆర్ ఏఎఫ్ ఫోర్స్ అండగా ఉంటుందని అవగాహన కల్పించేందుకు ఈ కవాతు నిర్వహించినట్లు టౌన్ ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.
రూ.50 కోసం గొడవ.. నిండు ప్రాణం బలి
పెబ్బేరు, వెలుగు : రూ.50 కోసం జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పెబ్బేరు ఎస్సై రామస్వామి వివరాల ప్రకారం.. గోపాల్ పేటకు చెందిన రామకృష్ణ(35), అతని తమ్ముడు రాముడు, మరో వ్యక్తి దాసరి నరసింహులు శనివారం పెబ్బేరు సంతకు వచ్చి తిరిగి వెళ్తుండగా బైక్ స్టాండ్ విరిగి పోయింది. కంచిరావుపల్లిలోని ఓ వెల్డింగ్ షాపు వెళ్లి వెల్డింగ్ చేయించుకున్నారు. అనంతరం షాపులో పనిచేసే గ్రామానికి చెందిన భరత్ రూ.100 ఇవ్వాలని అడగగా.. తాను రూ.50 మాత్రమే ఇస్తానని రామకృష్ణ తమ్ముడు అనడంతో గొడవ జరిగింది. రూ.100 ఇచ్చి వెళ్లే సమయంలో రాముడు భరత్‌ను బూతులు తిట్టడంతో.. భరత్‌తో పాటు కంచిరావుపల్లికి చెందిన శ్రీనివాసులు (ఓనర్), అశోక్, శివ, బాలనారి, బుడ్డయ్య వచ్చి ముగ్గురిపై దాడి చేశారు. రామకృష్ణను పిడిగుద్దులు గుద్దడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వనపర్తికి వెళ్లి ఆసుపత్రిలో చూపించుకోగా.. పరీక్షించిన డాక్టర్లు మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.
మృతుడి ప్రాణం ఖరీదు రూ.7.5 లక్షలు!
రామకృష్ణ మృతికి పంచాయతీ పెద్దలు, పోలీసులు రూ.7.5 లక్షలు ఖరీదు కట్టినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం బాధిత కుటుంబసభ్యులు పెబ్బేరు పోలీస్ స్టేషన్ కు రాగా... పెబ్బేరు, గోపాల్‌పేటకు చెందిన కొందరు పెద్దలు కొత్తకోట సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై రామస్వామితో బేరసారాలు పెట్టారు. మధ్యాహ్నం వరకు చర్చలు జరిపి నిందితుల నుంచి మృతుడి ఫ్యామిలీకి రూ.7,50,000 ఇచ్చేందుకు ఒప్పించినట్లు తెలిసింది. అనంతరం బోర్లా పడడంతో తన భర్త చనిపోయాడని మృతుడి భార్యతో ఫిర్యాదు చేయించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామస్వామి చెప్పారు.
బసవేశ్వరుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి
గండీడ్, వెలుగు: బసవేశ్వరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సూచించారు. మండలంలోని రెడ్డిపల్లిలో వీరశైవ లింగాయత్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప సహకారంతో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి , మహాలింగ స్వామి, అవదూత బసవలింగ మహాస్వామి, చిన్న బసవ ప్రభు స్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల జీవితాలను ఆదర్శంగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ రాధ, స్థలదాత డబ్బుల వెంకటమ్మ, వీరశైవ లింగాయత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సంగమేశ్వర్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నేతలు
గండీడ్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు ఆదివారం నంచర్ల గేట్ వద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, నేతలు భిక్షపతి, పెంటనాయక్, గిరిధర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మీ వెంకట్, సర్పంచులు రఘు, వెంకట్ రామ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, పార్వతమ్మ రాజేశ్వర్ పాల్గొన్నారు.
టీచర్ల బదిలీలు వెంటనే చేపట్టాలి
వనపర్తి టౌన్, వెలుగు: టీచర్ల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని తపస్ జిల్లా అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో సరిపడా క్లాస్ రూమ్స్ లేవని, క్లీనింగ్ కోసం స్కావెంజర్లు లేకపోవడంతో స్టూడెంట్లు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అంతకు ముందు పెద్దమందడి, పెబ్బేరు మండలాల నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ కావలి శ్రీనివాసులు, వనపర్తి సేవా ప్రముఖ యుగంధర్ పరిశీలకులుగా వ్యవహరించగా.. పెద్దమందడి మండల అధ్యక్షుడిగా అశ్విని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా రవికుమార్, పెబ్బేర్ మండల అధ్యక్షుడిగా ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా సతీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కొత్త కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి , నాయకులు ఈశ్వర్ , రాజశేఖర్ గౌడ్, విష్ణువర్ధన్ , మనోహర్ గౌడ్, కాగితాల రవి , మోహన్ గౌడ్ పాల్గొన్నారు.
సహాయకుడు లేక ఎగ్జామ్ రాయని అభ్యర్థి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: సహాయకుడు లేకపోవడంతో గ్రూపు–-1 అభ్యర్థి ఎగ్జామ్ రాయలేకపోయాడు. ఆదివారం అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన పవన్ కుమార్ నాగర్ కర్నూల్‌లోని ప్రభుత్వ హైస్కూల్లో ఎగ్జామ్ రాసేందుకు వచ్చాడు. తనకు కండ్లు స్పష్టంగా కనపడవని, సహాయకుడిని ఏర్పాటు చేయాలని కోరగా ఎగ్జామ్స్ సెంటర్ నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీంతో కలెక్టరేట్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న అధికారులకు రిక్వెస్ట్ చేశాడు. వాళ్లు తమకు తెలియదని, కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించడంతో అక్కడి నుంచి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అప్పటికే సమయం దాటిపోవడంతో తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.
సజావుగా గ్రూప్ –1 ఎగ్జామ్
ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్ సజావుగా సాగింది. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే సెంటర్ల వద్దకు చేరుకోగా.. నిర్వాహకులు హాల్ టికెట్ చెక్ చేసి, బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని లోపలికి పంపించారు. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు సెంటర్లను పర్యవేక్షించారు. వనపర్తిలో 4,343 మందికి 3,698, నాగర్ కర్నూల్‌లో 5,134 మందికి 4,107, మహబూబ్‌నగర్‌లో 12,123 మందికి 10,030, నారాయణపేటలో 2,132 మందికి 1,825, గద్వాలలో 4,874 మందికి 4,019 మంది ఎగ్జామ్‌కు అటెండ్ అయినట్లు ఆఫీసర్లు తెలిపారు.
– నెట్‌వర్క్, వెలుగు
నల్లమలలో భారీ వర్షం
అమ్రాబాద్, లింగాల, వెలుగు: నల్లమలలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి అమ్రాబాద్, పదర, లింగాల మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాల్లో పత్తి, మిరప, కంది పంటలు నీటమునిగాయి. అమ్రాబాద్ మండల పరిధిలోని అబ్బాస్ కుంట పూడిక తీయకపోవడంతో వరద గ్రామాన్ని ముంచెత్తింది. ఎర్రగుంట, ఎస్సీ కాలనీ, మార్కెట్, మైనారిటీ కాలనీతో పాటు కాలేజీ, స్కూల్, ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు జలమయం అయ్యాయి. మన్ననూర్ గ్రామంలోని వెంకటమ్మ (56) ఇల్లు కూలిపోయింది. లింగాల మండలం అంబటిపల్లి, అవుసలీకుంట గ్రామాల మధ్య వాగు ఉధృతంగా పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బైక్‌పై వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు.