పార్క్ స్థలాలు కబ్జా!

పార్క్ స్థలాలు కబ్జా!

నిజామాబాద్‌‌ మున్సిపల్‌‌ పరిధిలో 120 స్థలాలు ..    ఖాళీ జాగలపై అధికార పార్టీ లీడర్ల కన్ను

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో పార్క్ స్థలాలు కబ్జాకు గురువుతున్నా.. సంబంధిత ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని 39, 40వ డివిజన్లలోని పార్క్ స్థలాలను కొందరు కబ్జా చేసి ఏకంగా ప్రహరీ నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీకి చెందిన లీడర్లే కబ్జాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

7,680 గజాల్లో...

నగరంలోని గౌతంనగర్‌‌‌‌లో 1985లో ప్రభుత్వ ఉద్యోగుల కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 16 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి ప్లాట్లు చేశారు. మొత్తం స్థలంలో 10 శాతం స్థలాన్ని (7,680 గజాలు) మున్సిపల్ పార్క్ నిర్మాణానికి కేటాయించారు. ఒకప్పుడు స్లమ్ ఏరియాగా ఉన్న ఈ ప్రాంతం ఇటీవల బైపాస్ రోడ్డు రావడంతో ఈ స్థలానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో పార్కు స్థలంపై కొందరి కన్నుపడినట్లు తెలుస్తోంది. మొత్తం 16 ఎకరాల స్థలంలో 260 గజాలకు ఒక ప్లాట్ చొప్పున హౌసింగ్ సొసైటీ సభ్యులు 160 ప్లాట్లను చేసి అప్పుడే ఉద్యోగులు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పార్క్‌‌ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

రూ.1.25 కోట్ల కేటాయింపు..

గౌతంనగర్‌‌‌‌లో పార్క్ నిర్మాణం కోసం మున్సిపల్‌‌కు కేటాయించిన ఈ స్థలాన్ని 2017లో అమృత్ పథకం కింద డెవలప్‌‌ చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.1.25 కోట్లతో ప్రప్రోజల్స్‌‌కు సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు పార్కు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. తాజాగా పార్కు స్థలంలో అక్రమణదారులు షెడ్డు నిర్మాణం చేపట్టడంతో కబ్జా వ్యవహారం బయటకు వచ్చింది. మున్సిపల్ ఆఫీసర్లు స్పందించి పార్క్‌‌ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

చర్యలు తీసుకుంటాం...

పార్క్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపడుతున్నాం. మా పరిధిలో మొత్తం120 స్థలాలు ఉన్నాయి. 30 రోజుల్లో స్పెషల్‌‌ డ్రైవ్ చేపట్టి ఆక్రమణలను గుర్తిస్తాం. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు చేపడుతాం.  - చిత్రా మిశ్రా, అడిషనల్‌‌ కలెక్టర్