- నిర్మల్ పట్టణంలోని ప్రధాన కాల్వలు, చెరువు భూముల ఆక్రమణ
- వర్షాకాలంలో నీట మునుగుతున్న కాలనీలు
- ప్రమాదపు అంచుల్లో స్వర్ణ వాగు, జౌలి నాలా ప్రాంతాలు
- కాగితాలకే పరిమితమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రపోజల్స్
నిర్మల్, వెలుగు: వర్షాకాలంలో వస్తోందంటే చాలు.. నిర్మల్ పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లోని అనేక కందకాలు, నాలాలు, చెరువు భూములు కబ్జాలకు గురవుతుండడంతో ప్రతి ఏటా వరద బీభత్సం సృష్టిస్తోంది. సుమారు గంట పాటు ఏకధాటిగా వర్షం పడితే చాలు పట్టణమంతా జలమయమైపోతోంది. స్లమ్ ఏరియాలతో పాటు హైటెక్ కాలనీలు, హైవేపై ఉన్న ప్రధాన చౌరస్తాలు సైతం జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కబ్జాలకు గురైన కాల్వలు.. ముంపు బారిన కాలనీలు
నిర్మల్ చుట్టూరా ఉన్న గొలుసుకట్టు చెరువులతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కందకాలు, ప్రధాన నాలాలను ఆక్రమణదారులు పూడ్చి వేయడంతో ప్రస్తుతం అవి చిన్న చిన్న మురుగు కాల్వలుగా మారిపోయాయి. దీంతో వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి ఇవి నిండి నీరంతా రోడ్లపై పారడమే కాకుండా ఇండ్లలోకి సైతం చేరుతోంది. నిర్మల్ పట్టణంలోని స్వర్ణ వాగు వరద ప్రవహించే కాల్వ పక్కనే జీఎన్‌ఆర్ కాలనీ ఉండడంతో ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీరంతా ఈ కాలనీలో ప్రవహిస్తోంది. అలాగే నిర్మల్ పట్టణంలోని పాత బస్తీ గుండా ప్రవహించే జౌళీ నాలా కాల్వ కూడా ఆక్రమణకు గురికావడం ఇబ్బందిగా మారింది. ధర్మసాగర్ చెరువు ఆక్రమణకు గురి కావడమే కాకుండా దాని కింది భాగంలోని పంటపొలాలన్నీ కనుమరుగైపోవడం, పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు జరగడంతో ప్రియదర్శిని నగర్, మస్తాన్ దుబ్బా, మంజులాపూర్ వార్డులు ముంపునకు గురవుతున్నాయి. కంచరోని చెరువు కింద ఉన్న విద్యా నగర్, ఆదర్శ్ నగర్‌లు ముంపుబారిన పడుతున్నాయి. నిర్మల్‌లోని ప్రధాన కందకం ఆక్రమణ గురికావడంతో ఇందిరానగర్, శాస్త్రి నగర్, రవినగర్‌లు నీట మునుగుతున్నాయి. పల్లె చెరువు, గండి రామన్న గుట్టల ప్రాంతం నుంచి వచ్చే నీటితో విశ్వనాథ్ పేట్, గాజులపేట, వైఎస్సార్ కాలనీలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.
రెండేళ్ల కింద పూర్తిగా మునిగిన జీఎన్‌ఆర్ కాలనీ
నిర్మల్ పట్టణంలోని సిద్దాపూర్ స్వర్ణ వాగుకు అనుకొని ఉన్న జీఎన్‌ఆర్ కాలనీ ప్రజలు వర్షాకాలం అంటేనే గడగడలాడిపోతున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన వరదల కారణంగా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే స్వర్ణ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేశారు. దీంతో నీరంతా జీఎన్‌ఆర్ కాలనీని ముంచేసింది. వరద ప్రవాహం కారణంగా ఇండ్లలోని విలువైన వస్తువులు కొట్టుకుపోయాయి. కాలనీవాసులంతా ఇండ్లపైకి చేరుకొని రోజంతా అక్కడే గడిపి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు సుమారు 12 గంటల పాటు శ్రమించి వరద నుంచి ప్రజలను కాపాడారు. కాలనీలో సుమారు 10 రోజుల పాటు వరద నీరు నిలిచిపోయింది. ఆ తర్వాత నీరు తగ్గినప్పటికీ ఇండ్లలో బురద మేటలు వేశాయి. దీంతో ఇండ్లను బాగు చేసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆనాటి భయానక దృశ్యాలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. వర్షాకాలం వస్తుందంటే చాలా మంది తమ ఇండ్లలో ఉండేందుకే భయపడుతున్నారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు తమ బంధువుల ఇండ్లలో గానీ, మరో చోట అద్దెకు ఉండేందుకు గానీ సిద్ధమవుతున్నారు.
రూపురేఖలు కోల్పోయిన జౌలి నాలా
నిర్మల్ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతానికి జౌళి నాలాతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 25 ఏళ్ల కిందటి వరకు ఈ కాల్వ ద్వారా స్వర్ణ ప్రాజెక్ట్ నీరు పంట పొలాలకు చేరేది. క్రమంగా పంట పొలాలు రియల్ వెంచర్లుగా మారడం, కాల్వ పక్కన ఉన్న వారంతా క్రమంగా ఆక్రమించడంతో కాల్వ రూపురేఖలే మారిపోయాయి. ప్రాజెక్టు నీటి ప్రవాహం సైతం నిలిచిపోవడంతో ప్రస్తుతం ఇది ప్రధాన మురుగు కాల్వగా మారింది. పట్టణంలోని 15 వార్డుల నుంచి వచ్చే మురుగు నీరంతా ఈ కాల్వ గుండానే ప్రవహిస్తోంది. కాల్వను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడంతో బురద పేరుకుపోయి చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగాయి. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో ఈ ఈ నాలా పొంగి పొర్లుతుండడంతో రామారావుభాగ్, బేస్తవారిపేట, కాల్వ గడ్డ, రాంమందిర్, షేక్ సాహెబ్‌పేట్, కుర్రానపేట్ ముంపుకు గురవుతున్నాయి.
అటకెక్కిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
నిర్మల్ పట్టణంలో వరద ముంపు నివారణకు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రపోజల్స్ రెడీ చేశారు. సుమారు రూ. 60 కోట్లతో ప్రపోజల్స్ తయారుచేసి కేంద్రానికి పంపించారు. వీటిని పరిశీలించేందుకు మున్సిపల్ ఆఫీసర్లతో కమిటీని సైతం నియమించారు. అయితే నిధుల కొరత కారణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అటకెక్కాయి. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు, పట్టణంలోని కాలనీలు వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.